విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు
తాడేపల్లిగూడెం రూరల్: ‘మీ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని మరోసారి రుజువు చేశారు..’ అంటూ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని ఉద్దేశించి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. మండలంలోని కొండ్రుప్రోలు కేఎస్‌ఎన్ కాలనీలో గత ప్రభుత్వ హయాంలో నిర్మిం చిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ప్రాంతాన్ని గురువారం కొట్టు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020లో రూ.22.44 కోట్ల అంచనాతో పలు పనులకు శ్రీకారం చుడుతూ పంచాయతీరాజ్ శాఖ శిలాఫలకాన్ని నిర్మించిందని, దీనిని చూసి ఓర్వలేక కూల్చివేశారని విమర్శించారు. కూల్చివేతకు సంబంధించి ముగ్గురు, నలుగురు పేర్లు తన దృష్టికి వచ్చాయని, పంచాయతీరాజ్, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదన్నారు. అలాగే కలెక్టర్‌కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని విమర్శించారు. దీనిపై కోర్టు ద్వారా సంబంధిత శాఖ అధికారులకు నోటీసులిచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. గతంలో కూడా కేఎస్‌ఎన్ కాలనీ వాసులు ఇక్కడ ఆర్చి నిర్మిస్తే దానిని టీడీపీ హయాంలోనే కూల్చివేశారని గుర్తుచేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని శిలాఫలకాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు.
రెడ్‌బుక్ పాలన : రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌బుక్ పాలన సాగుతోందని మాజీ మంత్రి కొట్టు విమర్శించారు. గూడెం నియోజకవర్గానికి ఉపాధి హామీ నిధులు తక్కువ మంజూరయ్యాయన్నారు. మహిళలు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. బెల్టుషాపులు, పేకాట క్లబ్‌లు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని, 365 రోజులూ కోడిపందేలు జరుగుతున్నాయని, మద్యం షాపుల్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నాయ న్నారు. జిల్లా కలెక్టర్‌కు ఇవేమీ పట్టడం లేదని మండిపడ్డారు. గంజాయికి తాడేపల్లిగూడెం అడ్డాగా మారిందన్నారు. బెల్టు షాపుల రద్దు ఫైల్‌పై చంద్రబాబు తొలి సంతకం చేశారని గుర్తుచేస్తూ ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరైన నిధులతోనే ఇప్పటివరకు పనులు జరిగాయన్నారు. కూటమి పాలనలో ప్రభుత్వం నుంచి ఏ నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్‌లు, షో రూం నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కర్రి భాస్కరరావు, ముప్పిడి సంపత్‌కుమార్, కనుపూరి ఉదయ్ భాస్కర్, గార్లపాటి వీరకుమార్, కారింకి వీర్రాజు, గంగారావు, బండి గణపతి, పాలూరి శివ పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment