పలకాలి అందరి నోట
అ
మాతృభాష..
ఇ
ఈ
ఆ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, విదేశాల్లో కొలువుల కోసం ఇంగ్లిష్‌పై పట్టు తప్పనిసరిగా మారింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే ఇంగ్లిష్‌కే పరిమితం చేస్తుండగా మాతృభాషకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, యువత తెలుగుకు దూరమవుతున్నారని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి లక్ష్యంగా ఇంగ్లిష్, హిందీ నైపుణ్యాలను పెంచుకుంటూ తెలుగును మరిచేపోయే పరిస్థితికి వస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.
ఉద్యమంలా భాషా పరిరక్షణ
మాతృభాష పరిరక్షణకు జిల్లాలో ఇప్పటికే తెలుగు భాషా సంఘాలు, రచయితల సంఘాలు పూనుకున్నాయి. కరపత్రాల పంపిణీ, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు, తెలుగుభాషపై పోటీలు నిర్వహణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు తెలుగు సాహిత్య కార్యక్రమాలు, అవధానాలు, పుస్తక పరిచయాలు వంటి కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తూ భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నాయి.
నండూరి.. బుచ్చిబాబు.. మరెందరో..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగు భాషకు పట్టు గొమ్మ. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మాండలికాలు వేరుగా ఉన్నా ‘పశ్చిమ’ యాస ప్రత్యేకతను సంతరించుకుంది. పత్రికలు, పుస్తకాలు, నవలలు, సినిమాల్లో ఈ యాస ఎక్కువగా కనిపిస్తుంది. జిల్లాకు చెందిన పలువురు రచయితలు తమ రచనల ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎంకి, నాయుడు బావ పాటల సృష్టికర్త నండూరి వెంకట సుబ్బారావు ఈ జిల్లాకు చెందిన వారే. ఆయనతో పాటు బుచ్చిబాబు, కావలి సోదరులు, బొడ్డు బాపిరాజు, తిరుపతి వేంకట కవులు, కొనకళ్ల వెంకటరత్నం, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ వంటి రచయితలు తెలుగు భాషను శిఖరాగ్రాన నిలిపారు.
‘తెలుగు భాష తియ్యదనం.. తెలుగు భాష గొప్పతనం.. తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఓ మూలధనం.. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. కాని నీ భాషలో నువ్వు సంభాషించు..’ అంటూ మాతృభాష ఔన్నత్యాన్ని ఓ సినీ కవి ఎంతో గొప్పగా అభివర్ణించారు. పాశ్చాత్య ధోరణులతో మాతృభాషను విస్మరించవద్దని భాషాభిమానులు గొంతెత్తి చాటుతున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ ఖ్యాతి గడించిన తెలుగుపై అభిమానం యువతలో సన్నగిల్లుతోంది. కార్పొరేట్ కొలువులే లక్ష్యంగా ఆంగ్లంపై మక్కువ పెంచుకుంటూ తెలుగును విస్మరించడం తగదని భాషా నిపుణులు సూచిస్తున్నారు.
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
మానసిక పరిపక్వతకు..
మాతృభాషలో విద్యాబోధనతోనే విద్యార్థి మానసిక ఎదుగుదల, పరిపక్వత సాధ్యమవుతాయని పరిశోధ నలు స్పష్టం చేశాయి. 26 అక్షరాల (ఇంగ్లిష్) వెంటపడుతూ 56 అక్షరాల సంపదను మనం విస్మరించడం బాధాకరం. శక్తివంతమైన భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే గొప్ప భాష తెలుగు. తెలుగు భాష మాధుర్యాన్ని, గొప్పతనాన్ని భావితరాలకు అందించాలి.
–డాక్టర్ కొండా రవి, తెలుగు అధ్యాపకుడు,
నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల
గుర్తింపే ప్రశ్నార్థకంగా..
మాతృభాష అంటే ప్రతిఒక్కరికీ మమకారం పెరగాలి. ముఖ్యంగా తెలుగు ప్రజల్లో అదే లోపిస్తోందనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు మాట్లాడానికి కూడా సిగ్గుపడే పరిస్థితికి నేటితరం వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలానికి తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. తెలుగు ప్రజల గుర్తింపే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో పడతాం.
– గురు శర్మ, తెలుగు రచయిత
పరభాషల కోసం యువత పాకులాట
ఇంగ్లిష్ మోజులో తెలుగును విస్మరిస్తున్న వైనం
మాతృభాష మాధుర్యాన్ని మరుస్తున్న నేటితరం
తెలుగు గొప్పతనాన్ని గుర్తించాలంటున్న భాషాభిమానులు
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
పలకాలి అందరి నోట
పలకాలి అందరి నోట
Comments
Please login to add a commentAdd a comment