
మామిడి.. తగ్గనున్న దిగుబడి
నూజివీడు/చింతలపూడి: పండ్లలో రారాజు.. మామిడి. కానీ మామిడిని సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మాత్రం ఏటా దారుణంగా తయారవుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు, పురుగుల బెడద కారణంగా ఆదాయం రాకపోగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. నూజివీడు డివిజన్‌లో ప్రధాన వాణిజ్య పంటగా మామిడి దశాబ్దాలుగా భాసిల్లుతోంది. నూజివీడు రసాలు.. బంగినపల్లి ఖండాంతరాల్లో ఎంతో ఖ్యాతినార్జించింది. అలాంటి మామిడి పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. గతేడాది కాపులేకపోవడంతో ఈ ఏడాదైనా మామిడి ఆదుకుంటుందనే గంపెడాశతో ఉన్న రైతులను నట్టేట ముంచింది.
ఆశలు ఆవిరి
నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాల్లో ఉన్న మామిడి తోటల్లో డిసెంబరు నుంచి పూతలు గణనీయంగా రావడంతో రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. బంగినపల్లి, తోతాపురి, రసాలు తదితర అన్ని రకాల్లో పూతలు ముమ్మరంగా వచ్చాయి. డివిజన్‌లోని మొత్తం విస్తీర్ణంలో 80 నుంచి 90 శాతంకు పైగా తోటల్లో ఈ ఏడాది పూతలు వచ్చాయి. అయితే జనవరి రెండో వారం నుంచి మామిడి తోటలపై తామర పురుగు దాడి చేయడంతో వచ్చిన పూతంతా నిలువునా మాడిపోయింది. తామర పురుగుకు బూడిద తెగులు తోడవ్వడంతో మామిడి రైతుల పరిస్థితి కోలుకోలేని విధంగా తయారైంది. ఒక్కొక్క రైతు మామిడి పూత నిలుపుకోవడం కోసం 10 నుంచి 12 సార్లు రసాయన మందులను పిచికారీ చేసినప్పటికీ తామర పురుగును నియంత్రించలేకపోవడం గమనార్హం. దీంతో మామిడిపై రైతుల ఆశలన్నీ అడియాశలైపోయాయి. డివిజన్‌లోని 40వేల ఎకరాల్లో విస్తరించిన మామిడి తోటల పరిస్థితి దయనీయంగా మారింది.
పూత దశలోనే.. నష్టాల ఊబిలో
చింతలపూడి నియోజకవర్గంలో సైతం మామిడి రైతులకు ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పూత దశలోనే మామిడి రైతులు నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. నియోజకవర్గంలో 80 శాతం పైగా మామిడి తోటలు ఈ సంవత్సరం పూత పూసినప్పటికీ మంచు వల్ల పూత మాడిపోయి, పిందెలు రాలిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. 30 ఏళ్ల క్రితం దాదాపు 60 వేల ఎకరాల్లో ఉండే మామిడి..ఏటా వివిధ కారణాలతో మామిడి రైతులు నష్టపోతుండడంతో ఇప్పుడు కేవలం 7 వేల ఎకరాలకు పడిపోయింది. రైతులు మామిడి తోటలు నరికివేసి ప్రత్యామ్నాయంగా పామాయిల్, మొక్కజొన్న, పొగాకు, వేరుశనగ వంటి వాణిజ్య పంటలు పండిస్తున్నారు. నియోజకవర్గంలో ఏటా 90 శాతం బంగినపల్లి, 10 శాతం కలెక్టర్ (తూతాపురి) దిగుబడి ఉంటుంది. ప్రభుత్వం నుంచి మామిడి పంటకు సరైన ప్రోత్సాహం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మామిడి తోటలపై తామర పురుగు దాడి
నిలువునా మాడిపోయిన పూత
పెట్టుబడులు రాక నష్టాల ఊబిలో రైతాంగం
రెండేళ్లుగా మామిడి రైతులకు నష్టాలు

మామిడి.. తగ్గనున్న దిగుబడి
Comments
Please login to add a commentAdd a comment