
అక్రమాలకు అడ్డాగా గూడెం !
తాడేపల్లిగూడెం: గత ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న గూడెం పట్టణం మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్‌గా మారుతోంది. పాతికేళ్ల క్రితం పట్టణం పేకాట బ్యాచ్, దొంగనోట్లకు అడ్డా. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గడిచిన ఐదేళ్ల కాలంలో అసాంఘిక శక్తుల బెండు తీశారు. దొంగనోట్ల ముఠాలు, రౌడీ షీటర్లు పత్తాలేకుండా పోయారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యినట్టు కనిపిస్తోంది. పట్టణంలో వరుసగా జరుగుతున్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ విషయం స్పష్టమవుతోంది. తాజాగా జూదశాలలు పట్టణంలో యథేచ్ఛగా సాగుతున్నట్టు సమాచారం. ఇక్కడ పార్టీలు, కూటములతో సంబంధం లేకుండా జూదాలు నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బ్లేడ్ బ్యాచ్‌లు కాస్తా, గంజాయి బ్యాచ్‌లుగా రూపాంతరం చెందారు. నెల రోజుల క్రితం వరకు పట్టణంలో గంజాయి వాసన కనిపించగా అరకొర దాడులు, కేసులు నమోదుతో ఆగినట్టుగా కనిపిస్తోంది.
అన్ని వైపులా జూదశాలలున్నాయా!
పట్టణంలో మూడు దిక్కుల్లో జూదశాలలు రహస్యంగా నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. కడకట్ల, టూటౌన్ తణుకు మార్గంలో ఒక ప్రాంతంలో ఇవి ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటి నిర్వహణకు ఆమోద ముద్ర ఎవరు వేశారన్నది బహిరంగ రహస్యమేనని చెబుతున్నారు. రిమోట్ మాత్రం కడకట్ల ప్రాంతంలో ఉన్నట్టుగా జూదరులు బాహాటంగా అంటున్నారు. గతంలో పట్టణంలో ఆమోదిత జూదశాలలు ఉండేవి. ఆఫీసర్స్ క్లబ్, ఎన్‌జీఓస్ హోం వంటి చోట నిర్ధేశిత సమయాల్లో సీక్వెన్స్ ఆడుకొనే వెసులుబాటు ఉండేది. అలాంటి సమయంలో పోలీసుల దయాదాక్షిణ్యాలతో కొందరు పేకాటలను రహస్య ప్రాంతాల్లో నిర్వహించేవారు. క్లబ్‌లను అప్పట్లో ప్రభుత్వమే మూసివేసియడంతో పేకాటలపై పోలీసులు దాడులు పరిపాటిగా మారింది. తాజాగా జూద సంస్కృతి మళ్లీ తెరమీదకు వచ్చింది. పాత బ్యాచ్‌లు జూలు విదిల్చామనే సంకేతాలను వీటి నిర్వహణ ద్వారా ఇస్తున్నట్టు తెలుస్తోంది.
దొంగనోట్ల ముఠాలూ వచ్చాయా!
ఒకప్పుడు పట్టణం దొంగనోట్ల ముఠాలకు అడ్డా. నకిలీ కరెన్సీని బ్యాంకుల్లో కూడా జమచేసే కేటుగాళ్లు ఇక్కడ ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దొంగనోట్ల ముఠా ఎక్కడ దొరికినా మూలాలు ఇక్కడే ఉండేవి. జెకోస్లోవేకియా నకిలీ నోట్లను ఇక్కడ మార్చే ముఠాలు ఉండేవి. కాలక్రమంలో కనుమరుగయ్యాయి. తాజాగా మద్యం దుకాణాలలో, రద్దీగా ఉన్న వ్యాపార సముదాయాల్లో కొందరు యువకులు దొంగనోట్లు మారుస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై గూడెం పట్టణం, రూరల్, తణుకు సర్కిళ్ల పరిధిలో ఉన్న అధికారులు కూపీలాగే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం ఉంది. సుమారు 15 సెల్‌ఫోన్లలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి ముఠా ఆనవాళ్లు తదితర అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి నిందితులను కటకటాల వెనక్కి పంపించనున్నారని తెలుస్తోంది. వ్యాపార కేంద్రం నుంచి విద్యా కేంద్రంగా మారి అభివృద్ధి పథంలో వెళుతున్న పట్టణంలోని తిరిగి పాత జాడ్యాల వాసనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గత ఐదేళ్లుగా ప్రశాంతంగా పట్టణం
ప్రస్తుతం సీన్ రివర్స్
జూదాలు, గంజాయి, దొంగనోట్ల బ్యాచ్‌లకు అడ్డాగా మారుతున్న వైనం
భయాందోళన చెందుతున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment