
ఏజెన్సీలో అందని వైద్యం
కుక్కునూరు: ఏజెన్సీలో ఆదివాసీలకు వైద్యం అందని ద్రాక్షలా తయారైందని సీపీఐ మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారి విమర్శించారు. గురువారం కుక్కునూరు మండలంలోని బండారిగూడెం గ్రామానికి చెందిన ముచికి దేవమ్మ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ రాజమ్రండి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిందని ఆయన తెలిపారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు కూడా కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేకపోవడంతో తానే చొరవ తీసుకోని స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాటు చేసినట్లు మైపాక్షి చెప్పారు. వెంకటాపురం నుంచి బండారిగూడెం గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీలో 3 కిలోమీటర్లు మృతదేహాన్ని మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని తెలిపారు. గిరిజనులు ఇటువంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఇకనైనా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్
భీమవరం: దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా కేంద్రం బడ్జెట్ రూపొందించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. గురువారం భీమవరంలో నిర్వహించిన మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌పై అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం కోసం దేశవ్యాప్తంగా మేధావుల సదస్సులు నిర్వహిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ పీవీఎల్ మాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేశారని ప్రధానంగా పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం అభినందనీయమన్నారు. బీజేపీ నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్‌రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కాగిత వెంకటరమణ, తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఈతకోట తాతాజీ, భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యూట్రన్, కృష్ణ చైతన్య పాల్గొన్నారు.
డ్రెయినేజీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
తాడేపల్లిగూడెం అర్బన్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని డ్రెయినేజీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. డ్రెయినేజీలో మృతదేహం ఉండడాన్ని స్థానికులు చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని డ్రెయినేజీలోని మృతదేహాన్ని వెలుపలకు తీయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు నీలం చొక్కా,, నల్లఫ్యాంటు ధరించాడని, వివరాలు తెలిసిన వారు తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు.

ఏజెన్సీలో అందని వైద్యం

ఏజెన్సీలో అందని వైద్యం
Comments
Please login to add a commentAdd a comment