పంచాయతీల్లో ఇంటి దొంగలు
శురకవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సొమ్ములు బొక్కేస్తున్నారు
● రిసీప్ట్స్ హెడ్ నిధులను స్వాహా చేస్తున్న సిబ్బంది
● రాయలంలో రూ.2.33 కోట్లు కాజేసినట్టు నిర్ధారణ
● పలు పంచాయతీలపైనా ఫిర్యాదులు
● రాజకీయ ఒత్తిళ్లతో ముందుకు సాగని విచారణలు
● పారదర్శకంగా విచారిస్తే వెలుగులోకి మరిన్ని అక్రమాలు
భీమవరం రూరల్ రాయలం పంచాయతీకి షాపుల అద్దెలు, వేలం పాటలు, లెసెన్స్ ఫీజులు, ప్లాన్ అప్రూవల్స్ తదితర రూపాల్లో వచ్చిన రూ.2.33 కోట్ల ఆదాయాన్ని పంచాయతీ ట్రెజరీలోని అకౌంట్‌లో జమచేయకుండా సిబ్బంది తమ సొంతానికి వాడేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒక కార్యదర్శి రూ.1,99,50,956, మరో కార్యదర్శి రూ.14,94,224, జూనియర్ అసిస్టెంట్ రూ.15,98,455 దుర్వినియోగం చేసినట్టు తేలింది. ఆడిట్‌లో సైతం అక్రమాలు బయటపడకుండా వీరికి కొందరు అధికారులు సహకరించినట్టు గుర్తించారు. పక్కనే ఉన్న చినఅమిరం పంచాయతీలో సైతం ఇదే తరహాలో సొమ్ములను స్వాహా చేశారు. కేవలం రెండు పంచాయతీల్లో జరిపిన విచారణలో వెలుగు చూసిన అక్రమాలివి.
సాక్షి, భీమవరం: జిల్లాలోని 20 మండలాల పరిధిలో 409 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇంటి పన్నులకు సంబంధించి 3,11,954 అసెస్‌మెంట్లు ఉండగా ఆస్తి పన్ను డిమాండ్ రూ.30.98 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా రిసీప్ట్స్ హెడ్ కింద లైసెన్స్ ఫీజులు, ప్లాన్ అప్రూవల్స్, సాల్వెన్సీ సర్టిఫికెట్లు, సీనరేజీ, స్టాంప్ డ్యూటీ, పంచాయతీ షాపులు, ఆశీల వసూళ్లు, చేపల చెరువులు, కొబ్బరిచెట్లు, పచ్చగడ్డి తదితర వేలం పాటలు, పర్ కాపిటా గ్రాంట్ తదితర నాన్ టాక్స్ రూపంలో మరిన్ని నిధులు సమకూరుతుంటాయి. జిల్లా కేంద్రం, పట్టణ సమీప పంచాయతీలకు టాక్స్, నాన్‌టాక్స్ రూపంలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు చెల్లించే సొమ్ములను ఎప్పటికప్పుడు సిబ్బంది ట్రెజరీలోని పంచాయతీ పీడీ అకౌంట్‌లో జమచేయాలి. అత్యవసర నిల్వగా చిన్న పంచాయతీల్లో రూ.500, పెద్ద పంచాయతీల్లో రూ.5,000 వరకు నిల్వగా ఉంచుకోవచ్చు. అదీ కూడా ఒక్కరోజు మాత్రమే ఉంచి తర్వాత ట్రెజరీలో జమచేయాలి.
దారిమళ్లుతున్న సొమ్ములు : సాధారణంగా పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధిలైట్లు తదితర పనులు చేపట్టేందుకు పంచా యతీ తీర్మానంతో అంచనాలు రూపొందించి, పనికి సంబంధించిన వివరాలను ఎంబుక్‌లో రికార్డు చేసి నిధులు డ్రా చేయాలి. అత్యవసర సమయాల్లో ఆయా పనుల నిమిత్తం ర్యాటిఫై చేయడం ద్వారా నిధులు ఖర్చుచేయవచ్చు. చాలా పంచాయతీల్లో ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్ములను వెంటనే ట్రెజరీల్లో జమచేయకుండా అత్యవసర పనుల కోసమని తమ వద్దనే ఉంచేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు కార్యదర్శుల నుంచి జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు సిబ్బంది ప్రజల సొమ్ములను దారి మళ్లించి తమ సొంత అవసరాలకు సర్దుబాటు చేసుకుంటున్నారు. మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం ఆస్తిపన్ను లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారే తప్ప నాన్ ట్యాక్స్ పరిధిలోని రిసీప్ట్స్ హెడ్ నిధులపై అంతగా అజమాయిషీ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది. అక్రమాలు బయటపడకుండా ఆడిట్ అధికారులు సైతం పంచాయతీ సిబ్బందికి సహకరిస్తున్నట్టు విచారణల్లో బయటపడింది. రాయలం, చినఅమిరంలో అక్రమాలపై దర్యాప్తు చేయించిన కలెక్టర్ సీహెచ్ నాగరాణి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
న్యూస్‌రీల్
మరిన్ని పంచాయతీల్లో...
జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణానికి చేరువగా ఉన్న భీమవరం రూరల్, పాలకోడేరు, వీరవాసరం, ఉండి మండలాలు అలాగే తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పట్టణ సమీపంలోని పలు పంచాయతీల్లో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పది వరకు పంచాయతీలపై ఫిర్యాదులు రాగా డీఎల్‌పీఓ స్థాయి అధికారులు విచారణలు జరుపుతున్నారు. తమ పలుకుబడితో రాజకీయ నాయకుల ద్వారా పై అధికారుల ఒత్తిడి తీసుకురావడం, ప్రలోభాలకు గురిచేయడంలో కొందరు సిబ్బంది ఆరితేరినట్టు తెలు స్తోంది. పంచాయతీల్లో కేవలం ఆస్తి పన్ను వసూలు లక్ష్యానికే పరిమితం కాకుండా రిసీప్ట్స్ హెడ్ నిధులు ఎంత మేర వసూలయ్యాయి? ఎంత వరకు ట్రెజరీల్లో చెల్లింపులు చేశారనే విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని పంచాయతీల్లో అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
విచారణలు జరిపిస్తున్నాం: డీపీఓ
పంచాయతీల్లో అవకతవకలపై డీపీఓ అరుణశ్రీని సంప్రదించగా పలు పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్టు అందిన ఫిర్యాదులపై అధికారులతో విచారణలు జరిపిస్తున్నామని చెప్పారు. త్వరలో నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
పంచాయతీల్లో ఇంటి దొంగలు
Comments
Please login to add a commentAdd a comment