ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి
భీమడోలు : భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం కాంట్రాక్ట్ ఉద్యోగి తల్లిబోయిన పరమేశ్వరరావు(33) శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రక్త పరీక్ష కేంద్రం వద్ద విధి నిర్వహణలో ఉన్న అతను పాత ఓపీ బ్లాక్ వద్ద మృతిచెందడాన్ని సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుండుగొలనుకు చెందిన పరమేశ్వరరావు మధుమేహంతో చిన్నతనం నుంచి బాధపడుతున్నాడు. రోజులానే ఆసుపత్రికి వచ్చి మధ్యాహ్నాం భోజనం చేసేందుకు పాత ఓపీ బ్లాక్ వద్దకు వెళ్లాడు. భోజనం చేయకుండానే అక్కడ విగత జీవిగా పడి ఉన్నాడు. కొడుకు సాయంత్రం 5.30 గంటలకు కూడా రాలేదని తండ్రి వెంకట్రావు, ఆసుపత్రికి ఫోన్ చేశారు. దీనితో సిబ్బంది ఆసుపత్రిలోని బ్లాక్‌లను పరిశీలించగా పాత ఓపీ బ్లాక్ వద్ద పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పరమేశ్వరరావు ముక్కు నుంచి రక్తం కారడాన్ని గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment