జిల్లా ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం
తణుకు అర్బన్: టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నోడల్ ఆఫీసర్లకు శిక్షణనిచ్చే సెంట్రల్ టీబీ డివిజన్ (సీటీడీ) బృందం మంగళవారం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించింది. ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్‌లో భాగంగా వార్డులు, ల్యాబ్‌లు, పర్యావరణ ప్రాంతాలను పరిశీలించి ఇన్ఫెక్షన్లు అరికట్టేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ ఆధ్వర్యంలో వైద్యవర్గాలకు సమావేశంలో తెలిపారు.
గూడెం నేతలకు రాష్ట్ర పదవులు
తాడేపల్లిగూడెం: గూడెం నియోజకవర్గ నేతలకు వైఎస్సార్‌సీపీలో పదవులు దక్కాయి. స్టేట్ ఇంటలెక్చువల్ ఫోరం సొసైటీ రాష్ట్ర కార్యదర్శిగా లాయర్ డాక్టర్ హరిదాసుల రవీంద్రకుమార్, జాయింట్ సెక్రటరీగా ఆలిండియా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు ఎస్.ఎస్.ప్రసాద్, స్టేట్ బీసీ సెల్ జనరల్ సెక్రటరీగా పెంటపాడు మండల జట్లపాలెం గ్రామానికి చెందిన కట్టుబోయిన కృష్ణ ప్రసాద్ ఎంపికయ్యారు. పార్టీ శ్రేణులు వీరికి అభినందనలు తెలిపాయి.
ఇంటర్ పరీక్షకు 95.5 శాతం హాజరు
భీమవరం : జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 95.5 శాతం మంది హాజరయ్యారని డీఐఈవో ఎ.నాగేశ్వరరావు చెప్పారు. జనరల్ పరీక్షకు 18,753 మందికి 18,061 మంది, ఒకేషనల్ పరీక్షకు 2,191 మందికి 1,956 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
రొయ్య రైతులను ఆదుకోవాలి
నరసాపురం రూరల్: రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్య రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.బలరాం డిమాండ్ చేశారు. మంగళవారం వేములదీవి పడమర గ్రామంలో ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఆక్వా రైతులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గతంలో 100 కౌంట్ ధర కిలో రూ.290 ఉంటే ప్రస్తుతం రూ.230కి పడిపోయిందన్నారు. ఆక్వా సాగుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని కోరారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
తణుకు అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు తణుకులో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 15న తణుకు రానున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఇతర అధికారులు తణుకులో పలు ప్రాంతాలను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో హెలిపాడ్, ఆడిటోరియం, బాలికోన్నత పాఠశాలలో పార్కింగ్ ప్రదేశం, బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజా వేదిక, స్టాల్స్ ప్రదర్శనకు ప్రాథమికంగా స్థలాల పరిశీలన చేశారు. సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులతో నిర్వహించనున్న ముఖాముఖిలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారని, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సభా ప్రాంగణంలో 3 వేల మందితో ఏర్పాటు చేయనున్న పబ్లిక్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని చెప్పారు.
జిల్లా ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం
Comments
Please login to add a commentAdd a comment