పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి
మున్సిపల్ ఆర్డీ నాగ నర్సింహారావు
నరసాపురం : మున్సిపాలిటీల్లో పారిశుద్య నిర్వహణ పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా అధిక ప్రాధాన్యం ఇచ్చి పనిచేయాలని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్(రాజమండ్రి) సీహెచ్ నాగ నర్సింహారావు జిల్లాలోని కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ హాలులో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీ మాట్లాడుతూ దాదాపు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య పనుల్లో లోపాలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులు, ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
యాక్షన్ ప్లాన్ తయారీకి ఆదేశం
కుళాయిల ద్వారా మంచినీటి సరఫరాపై జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు యాక్షన్ ప్లాన్స్ తయారు చేసి అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆర్డీ ఆదేశించారు. వేసవిలో ఎక్కడా మంచినీటి ఎద్దడి రాకూడదన్నారు. నీటి వనరులను బట్టి వేసవిలో ఒకపూట కుళాయిల ద్వారా నీరు ఇవ్వాలా? రెండు పూటలా ఇవ్వాలా? అనే అంశంపై ఆయా మున్సిపాలిటీల కమిషనర్‌లు ముందుగా తనకు నివేదిక అందజేయాలని, ప్రజలకు కూడా ముందుగా తెలియజేయాలన్నారు. ఆస్తి పన్నులు వేయాలని దరఖాస్తు పెట్టుకున్నా పన్నులు వేయకుండా నెలల తరబడి ఎందుకు తిప్పిస్తున్నారని నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఫిర్యాదులు వస్తే రాతపూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేస్తానని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment