
ఉజ్వల భవితకు పాలిటెక్నిక్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న వేళ విద్యార్థులు కూడా సాంకేతికతకు సంబంధించిన కోర్సులను నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజనీరింగ్‌లో సైతం కంప్యూటర్ ఆధారిత కోర్సులవైపే మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల కంటే ముందుగానే ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులకు లభిస్తుంది. దీంతో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుపై దృష్టి పెడుతున్నారు.
సాంకేతిక విద్యకు పునాది
సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష ఏప్రిల్ 30వ తేదీన జరగనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025ను ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే, దానిని పునాదిగా మార్చుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక విద్యను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందొచ్చని సూచిస్తున్నారు.
దరఖాస్తుకు ఏప్రిల్ 15 వరకూ గడువు
పాలిసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఈ నెల 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి గాను ఈ నెల 12వ తేదీ నుంచే ఫీజులను ఆన్‌లైన్‌లో గేట్‌వే ద్వారా చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉంచారు. పాలిసెట్ ఎంట్రన్స్ రాయదలుచుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకూ గడువు ఉంది. 10వ తరగతి, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, ఈ ఏడాది అటువంటి పరీక్షలు రాస్తున్నవారు కూడా పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష 120 మార్కులకు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
జిల్లాలో 7 పాలిటెక్నిక్ కళాశాలలు
జిల్లాలో విద్యార్థులకు మొత్తం 7 పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏలూరులోని సీఆర్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, హేలాపురి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కలిదిండిలో డాక్టర్ వైఎస్‌ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నూజివీడులో నూజివీడు పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ సారధి ఇనిస్టిట్యూట్ ఆప్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలున్నాయి. వాటన్నింటిలో కలిపి మొత్తం 2,536 సీట్లు వివిధ కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా ముదినేపల్లిలో ఏవీఎన్ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా ఈ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు అతి స్వల్పంగా ఉండడంతో ఈ ఏడాది తమ కళాశాలను నిర్వహించలేమని, మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆ కళాశాల యాజమాన్యం సాంకేతిక విద్యాశాఖకు దరఖాస్తు చేసుకుంది.
దరఖాస్తుకు ఏప్రిల్ 15 వరకూ గడువు
ఏప్రిల్ 30న పాలిసెట్ పరీక్ష
జిల్లాలో 7 పాలిటెక్నిక్ కళాశాలలు
అందుబాటులో 2,536 సీట్లు
సద్వినియోగం చేసుకోవాలి
పదో తరగతి ముగిసిన వెంటనే పాలిటెక్నిక్ చదివితే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి. పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారి సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేస్తారు. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఆయా కళాశాలల్లో ఉచిత కోచింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.
– పెదపట్నం సుబ్రహ్మణ్యం, ఏపీ పాలిసెట్ ఏలూరు జిల్లా కో–ఆర్డినేటర్
లభించే కోర్సులు ఇవీ
పాలిటెక్నిక్‌లో వివిధ కోర్సులను జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. పాలిటెక్నిక్ కోర్సుల కాల వ్యవధి మూడేళ్ల వరకు ఉంటుంది. ఆరు నెలల పాటు విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ కూడా ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు.

ఉజ్వల భవితకు పాలిటెక్నిక్