
మద్యం దుకాణంలో వ్యక్తిపై దాడి
తణుకు అర్బన్ : మద్యం దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని అగంతకుడు దాడిచేసిన ఘటన తణుకులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తణుకు ఉండ్రాజవరం జంక్షన్ గణేష్ చౌక్ ప్రాంతంలోని మద్యం దుకాణం (నైట్ పాయింట్)లో మద్యం విక్రయిస్తున్న పట్టణానికి చెందిన సిర్రా పండుపై గుర్తుతెలియని వ్యక్తి చేసిన దాడి భయబ్రాంతులకు గురిచేసింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన అగంతకుడు మద్యం దుకాణం వద్దకు వచ్చి తచ్చాడిన తరువాత దుకాణంలో ఉన్న పండుపై ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా దాడిచేయడంతో బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో పుటేజీలో దాడి జరిగిన తీరు భయాన్ని కొలిపే విధంగా ఉంది. దాడిచేసే సమయంలో దుకాణం వద్దకు వచ్చిన వారిని కూడా అగంతకుడు హెచ్చరించడం, ఆ తరువాత తాపీగా అతడు వాహనాన్ని స్టార్ట్ చేసుకుని వెళ్లడం సంచలనంగా మారింది. పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి సీపీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పండు కుటుంబ సభ్యులు.దళిత వర్గాలు తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.

మద్యం దుకాణంలో వ్యక్తిపై దాడి