
త్యాగానికి ప్రతీక రంజాన్
చింతలపూడి: నెల రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగ సోమవారం జరుపుకోనున్నారు. ఆదివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో ఉపవాసాలను నమాజుతో విరమించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసే ముందు పేదలకు సాయం చేస్తారు. ఈదుల్ ఫితర్ నమాజ్‌ను పురస్కరించుకుని పిల్లలు, పెద్దలు కొత్త దుస్తులు ధరించి ఈద్గాహ్, మసీదులకు వెళ్ళి సామూహికంగా ప్రార్థనలు చేస్తారు. నమాజు అయిన తరువాత ముస్లింల స్మశాన వాటిక(ఖబరస్తాన్)కు వెళ్ళి పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు. అనంతరం కుటుంబంలోని పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలియచేసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. నమాజు ముగిశాక బంధుమిత్రులు, స్నేహితులను ఆహ్వానించి సేమియా పాయసం, షీర్ ఖుర్మా తినిపిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రం పసందైన వంటకాలతో స్నేహితులను, బంధు మిత్రులను పిలిచి ఆప్యాయంగా పెడతారు.
దివ్య ఖురాన్ అవతరించిన నెల
ఖురాన్ అవతరించింది రంజాన్ మాసంలోనే.. అల్లాహ్ నుంచి 1,24,000 మంది ప్రవక్తలు రాగా వారిలో మహమ్మద్ ప్రవక్త చివరి వారు. క్రీ.శ.624 మార్చి 27న తన సహచరులతో కలిసి మదీనాలో ఈదుల్ ఫితర్ పాటించారని ప్రతీతి. సాధారణ రోజుల్లో ఎవరికై నా దానం చేస్తే దానిని స్వీకరించిన వ్యక్తి మాత్రమే లెక్కలోకి వస్తాడని, రంజాన్ మాసంలో ఒక వ్యక్తికి దానం చేస్తే వందమందికి చేసినంత ఫలితం ఉంటుందని భావిస్తారు. ఈ నెలలో చేసే దానాలు నేరుగా దైవ సన్నిధికి చేరతాయని నమ్మకం.
నేడు పండుగ జరపుకోనున్న ముస్లింలు