మెడికల్‌ షాపులపై దాడులు | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ షాపులపై దాడులు

Published Sat, Mar 22 2025 12:53 AM | Last Updated on Sat, Mar 22 2025 1:04 AM

మెడిక

మెడికల్‌ షాపులపై దాడులు

తణుకు అర్బన్‌ : పట్టణంలోని మెడికల్‌ షాపులపై శుక్రవారం విజిలెన్స్‌, ఈగల్‌, ఔషధ నియంత్రణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న మందుల వివరాలు, నిల్వలు, ఎక్స్‌పైరీ తేదీలు తదితర అంశాలతోపాటు నిషేధిత మందుల నిల్వలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్‌ జిల్లా ఎస్పీ శ్రీరామ్‌బాబు ఆదేశాల మేరకు తణుకు పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేసినట్లు విజిలెన్స్‌ ఎస్సై కె.సీతారాం తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తంగిరాల వారి వీధిలోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూలు ఎదురుగా ఉన్న భవనం మూడో అంతస్తులో అనధికారికంగా నిల్వ ఉంచిన నిషేధిత మందులను గుర్తించినట్లు చెప్పారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచేవి, మత్తునిచ్చేవి, గర్భస్రావం అయ్యేటటువంటి మందులను అనధికారికంగా నిల్వ ఉంచి విక్రయాలు చేస్తున్న పెంజర్ల నాగేశ్వరరావుపై డ్రగ్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ యాక్ట్‌ 1940 అండర్‌ సెక్షన్‌ 18 సీ ప్రకారం కేసు నమోదు చేసి, అతని నుంచి మందులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ మందులు తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన బచ్చు వెంకట సుబ్బారావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. అలాగే తణుకు పట్టణంలోని రాష్ట్రపతి రోడ్డులో మరొక మూడు దుకాణాల్లో తనిఖీలు చేశారు. దాడుల్లో ఈగల్‌ సీఐ సూర్య మోహన్‌రావు, సీసీఎస్‌ సీఐ రాంబాబు, తణుకు డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.మల్లికార్జునరావు, విజిలెన్స్‌ ఏఈ ఎం.అనీల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలో..

తాడేపల్లిగూడెం : పట్టణంలోని మెడికల్‌ షాపులపై శుక్రవారం విజిలెన్సు అధికారులు దాడులు చేశారు. పట్టణంలోని పోర్టుగేట్‌ డ్రగ్‌ హౌస్‌లో ఈ సోదాలు జరిగాయి. దుకాణం లైసెన్సు, నిషేధిత మందులు ఏమైనా ఉన్నాయా? జీఎస్‌టీ ఇతర అంశాలపై డ్రగ్స్‌, పోలీసు అధికారుల సమక్షంలో దాడులు చేశారు. తనిఖీల నేపధ్యంలో పట్టణంలోని మెడికల్‌ షాపులను మూసివేశారు. విజిలెన్సు సీఐ శివరామకృష్ణ, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అబీద్‌ అలీ, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

అత్తిలిలో..

అత్తిలి : స్థానిక సత్యకృష్ణ మెడికల్‌ షాపును విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జౌషధ నియంత్రణశాఖ సంయుక్తంగా శుక్రవారం తనిఖీ చేశారు. మెడికల్‌షాపులో అనుమతి లేని మందులతో పాటు కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామని భీమవరం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అబిద్‌ అలీ తెలిపారు. ట్యాబ్లెట్‌ షీట్లపై ఎక్స్‌పైరీ డేట్‌ కట్‌ చేసి స్టిక్కర్లు వేసి మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి, షాపును మూయించివేశారు. మెడికల్‌ షాపు లైసెన్సును రద్దు చేస్తామని అలీ చెప్పారు.

ఏలూరు జిల్లాలో..

ఏలూరు టౌన్‌ : ప్రభుత్వ ఆదేశాలతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులతో సంయుక్తంగా ప్రత్యేకంగా నియమితులైన విచారణ అధికారులు మెడికల్‌ షాపులపై దాడులు చేశారు. ఏలూరు జిల్లాలో నూజివీడు, ఏలూరు, ద్వారకాతిరుమల ప్రాంతాల్లో ఒకేసారి అధికారులు తనిఖీలు చేశారు. ఏలూరు నగరంలోని ఉదయ్‌ జనరిక్‌, సద్భావన మెడికల్స్‌, ద్వారకాతిరుమలలోని సంజీవిని మెడికల్స్‌, నూజివీడు ప్రాంతంలో సాయి బాలాజీ మెడికల్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. మందుల షాపుల్లో అనధికారికంగా మందుల విక్రయాలు, డాక్టర్స్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందుల విక్రయాలు, గడువు ముగిసిన మందులను సైతం ఇష్టారాజ్యంగా అమ్ముతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. రికార్డులు సైతం సక్రమంగా లేవని అధికారుల గుర్తించారు. కొన్ని మందుల షాపుల్లో శుక్రవారం రాత్రి వరకూ తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీల్లో భీమడోలు సీఐ యూజే విల్సన్‌, ఏలూరు త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు, నూజివీడు రూరల్‌ సీఐ కె.రామకృష్ణ, విజిలెన్స్‌ విభాగం సీఐ ప్రసాద్‌కుమార్‌, ఎస్సై రంజిత్‌కుమార్‌, నాగరాజు, విజిలెన్స్‌ డీఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

తణుకులో నిషేధిత మందులు స్వాధీనం

మెడికల్‌ షాపులపై దాడులు 1
1/1

మెడికల్‌ షాపులపై దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement