
పసల కృష్ణభారతి యువతకు ఆదర్శనీయం
తాడేపల్లిగూడెం అర్బన్ : గాంధేయవాది, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణ భారతి నేటి యువతరానికి ఆదర్శనీయమని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కృష్ణభారతి మృతిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మిల రెండో కుమార్తె కృష్ణభారతి తల్లిదండ్రుల అడుగుజాడల్లో పయనించి స్వాతంత్య్ర సమరయోధురాలిగా నిలిచారని అన్నారు. ఆమె వృద్ధాశ్రమాలను స్థాపించి నిరాశ్రయులైన వృద్ధులకు తోడుగా నిలిచి సేవా తత్పరత కలిగిన మహిళగా ప్రసిద్ధి పొందారని మాజీ మంత్రి కొట్టు తెలిపారు. ఆమె కుటుంబం తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. కృష్ణభారతి కుటుంబంతో తమకు బంధుత్వం ఉందని గుర్తు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కృష్ణభారతి పోషించిన కీలక పాత్రను తెలుసుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వయంగా ఆమె పాదాలకు నమస్కరించడం ఆమె ఔన్నత్యానికి నిదర్శనమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కృష్ణభారతి కుటుంబ సభ్యులకు కొట్టు సత్యనారాయణ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
అత్తిలి: హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ పిలుపునిచ్చారు. సోమవారం అత్తిలి టీటీడీ కల్యాణ మండపంలో హైందవి, శ్రీహనుమాన్ శక్తిజాగరణ సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామజపయజ్ఙం–పూర్ణాహుతి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం విశ్వక్సేనపూజ, మండపారాధన, హోమాలు, శ్రీరామ జపయజ్ఙం మంగళవాయిద్యాల నడుమ వైభవోపేతంగా జరిగంది. సామూహిక విష్ణుసహస్రనామ పారాయణ, హనుమాన్‌చాలీసా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త డాక్టర్ అనంతలక్ష్మి, తపన ఫౌండేషన్ వ్యవస్ధాపకులు గారపాటి సీతారామంజనేయచౌదరి, శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక అధ్యక్షుడు కరుణాకర్ సుగ్గుణ, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, శ్రీరామ జపయజ్ఙ నిర్వహణ సమితి సభ్యులు సాధనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పసల కృష్ణభారతి యువతకు ఆదర్శనీయం