ట్రిపుల్‌ ఐటీల్లో సమస్యలు తొలగేనా? | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీల్లో సమస్యలు తొలగేనా?

Published Fri, Mar 28 2025 12:43 AM | Last Updated on Fri, Mar 28 2025 12:43 AM

ట్రిపుల్‌ ఐటీల్లో సమస్యలు తొలగేనా?

ట్రిపుల్‌ ఐటీల్లో సమస్యలు తొలగేనా?

నూజివీడు : రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్కొక్క ట్రిపుల్‌ ఐటీలో 6,600 మంది చొప్పున నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి 26,400 మంది విద్యార్థులున్నారు. దేశంలోని 15 ఐఐటీల్లో కలిపి కూడా ఇంత మంది విద్యార్థులు ఉండరు. అంతటి ప్రాధాన్యం కలిగిన ట్రిపుల్‌ ఐటీని ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క నిర్ణయం కూడా తీసుకోకుండా ఇన్‌చార్జి డైరెక్టర్‌లపైన, ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌లపైన పాలనను వదిలేసింది. వారంతా ఇన్‌చార్జిలు కావడంతో తమకెందుకొచ్చిన గొడవ అని కీలక నిర్ణయాలను తీసుకునే విషయమై మిన్నకుంటున్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ల్యాప్‌టాప్‌లు లేవు, యూనిఫాం లేదు

ప్రస్తుత విద్యా సంవత్సరం ఏప్రిల్‌ నెలాఖరుకు ముగుస్తున్నా నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లోని పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇంత వరకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వలేదు. అలాగే యూనిఫాం ఇవ్వలేదు. అడ్మిషన్లు పూర్తయిన వెంటనే తరగతులు ప్రారంభమయ్యే రోజునే విద్యార్థులకు ఈ రెండూ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇంత వరకు ఇవ్వకపోవడాన్ని బట్టే ట్రిపుల్‌ ఐటీలను గాలికి వదిలేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ల్యాప్‌టాప్‌లు లేకపోవడంతో విద్యార్థులు పీడీఎఫ్‌లు జిరాక్స్‌లు తీయించుకొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించే సంస్థలో ల్యాప్‌టాప్‌లు ఇవ్వడంలో ఇంత జాప్యంపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ తొమ్మిది నెలలు గవర్నింగ్‌ కౌన్సిల్‌(జీసీ) మీటింగ్‌ జరగాలంటూ ట్రిపుల్‌ ఐటీ అధికారులు కూడా కాలయాపన చేసుకుంటూ వచ్చారు.

ల్యాబ్‌ అసిస్టెంట్‌లకు టైమ్‌ స్కేల్‌ ఇస్తారా?

ఆర్జీయూకేటీలో పనిచేస్తున్న ల్యాబ్‌ అసిస్టెంట్‌లకు టైమ్‌ స్కేల్‌ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇది ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో గత ఐదు నెలలుగా టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలని ల్యాబ్‌ అసిస్టెంట్‌లు ఆర్జీయూకేటీ అధికారులను అడుగుతున్నారు. దీనికి వారు జీసీ అనుమతి ఉండాలంటూ టైమ్‌ స్కేల్‌ ఇవ్వకుండా కాలం గడుపుకొస్తున్నారు.

ఇన్‌చార్జిల ఏలుబడిలో ట్రిపుల్‌ ఐటీలు

కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వెనకడుగు

సమస్యలపై దృష్టిపెట్టని కూటమి ప్రభుత్వం

సదుపాయాల కొరతతో విద్యార్థుల అవస్థలు

నేడు ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం

పూర్తిస్థాయి అధికారులనే నియమించలేదు

కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇంత వరకు రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు డైరెక్టర్లను గాని, ఆర్జీయూకేటీకి వైస్‌ చాన్సలర్‌ను గాని, చాన్సలర్‌ను గాని ఇంత వరకు నియమించలేదు. డైరెక్టర్లు, వైస్‌చాన్సలర్‌, రిజిస్ట్రార్‌ అందరూ ఇన్‌చార్జిలే ట్రిపుల్‌ఐటీల పాలనను నెట్టుకొస్తున్నారు. ఈ ఇన్‌చార్జిలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో సాహసం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 28న గవర్నింగ్‌ కౌన్సిల్‌(జీసీ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ఇన్‌ఛార్జి వైస్‌చాన్సలర్‌, ఇన్‌చార్జి రిజి స్ట్రార్‌, నలుగురు ఇన్‌చార్జి డైరెక్టర్లు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌, ఉన్నత విద్య సెక్రటరీ, ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ హైదరాబాద్‌కు చెందిన డైరెక్టర్లు, మరికొందరు ఈ జీసీ సమావేశంలో పాల్గొననున్నారు. కొందరు ఆన్‌లైన్‌లోను, మరికొందరు నూజివీడు ట్రిపుల్‌ఐటీ నుంచి ఈ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనైనా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటారో లేదోనని ట్రిపుల్‌ ఐటీల సిబ్బంది వేచి చూస్తున్నారు.

ఆరు వేల మందికి ఒకరే మెస్‌ నిర్వాహకుడు

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలోని 6,600 మంది విద్యార్థులకు ఒకే మెస్‌ నిర్వాహకుడు రెండు పూటలా భోజనాన్ని, ఒకపూట టిఫిన్‌ను అందించాల్సి రావడంతో విద్యార్థులకు సకాలంలో భోజనం అందకపోవడంతో పాటు ఒకే నిర్వాహకుడికి అప్పగించడం కూడా సమంజసం కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌ 20న నూజివీడు ట్రిపుల్‌ ఐటీని సందర్శించిన త్రిసభ్య కమిటీ అక్టోబర్‌ మొదటి వారానికల్లా మెస్‌ టెండర్లను పిలిచి మెస్‌ నిర్వాహకులను నియమిస్తామని చెప్పారు. ఇది చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు కనీసం టెండర్‌ ప్రక్రియను కూడా ప్రారంభించలేదు. ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఇంకెక్కడా ఉండదనే అభిప్రాయం ట్రిపుల్‌ ఐటీలో సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement