నరసాపురం: మా స్కూల్ మాకు కావాలి.. మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేకుండా చేయొద్దు.. అంటూ నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ గొందిమూల గ్రామస్తులు గురు వారం ఆందోళన చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా గ్రామాల్లోని కొన్ని ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తుండటంతో గొందిమూల గ్రామస్తులు ఆందోళన చేశారు. సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ముందుగా గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసి ఎంపీడీఓ కృష్ణంరాజు, ఎంఈఓ పుష్పరాజ్యంకు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం నరసాపురం ఆర్డీఓ కార్యాలయంలో కూడా వినతిపత్రం ఇచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు మాట్లాడుతూ అనాలోచిన నిర్ణయాలతో గ్రామాల్లో ప్రభుత్వ బడులు లేకుండా చేయడం దారుణమన్నారు. గ్రామస్తులు కవురు తులసి, తుమ్మ మాధవి, పోతుమేను దుర్గ, తుమ్మా లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.
టీకాలు వేస్తున్నాం
తణుకు అర్బన్: ‘శునకాలు, పశువులకు స్కిన్ అలర్జీలు’ శీర్షికన ఈనెల 25న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి తాడేపల్లిగూడెం పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్‌కే సుధాకర్ స్పందించారు. ఆవులు, గిత్తల్లో ముద్ద చర్మ వ్యాధి కారణంగా మచ్చలు ఏర్పడ్డాయని, నివారణకు టీకాలు, చికిత్స అందిస్తామన్నారు. వీధి శునకాలకు పోషకాహార లోపం, ఇతర కారణాలతో చర్మంపై అలర్జీ మచ్చలు ఏర్పడతాయని, జుట్టు రాలిపోవడం సాధారణమని, ఇలాంటి శునకాలకు సరైన సమయంలో చికిత్స అందించాలన్నారు. అన్ని పశువుల ఆస్పత్రుల్లో స్కిన్ అలర్జీలకు వైద్యం అందుబాటులో ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాల్లో నియమించారు. రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా పోలిశెట్టి గోపినాథ్, ఎస్సీ సెల్ సెక్రటరీ కొల్లాబత్తుల రవికుమార్, వలంటీర్స్ వింగ్ సెక్రటరీగా జి.అలివర్, వీవర్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా మావూరి సత్యనారాయణ నియమితులయ్యారు.
బూత్ కమిటీల జోనల్ అధ్యక్షుడిగా బీవీఆర్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడేనికి చెందిన బీవీఆర్ చౌదరిని వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీల విభాగం జో నల్ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఆయన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకముంచి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు.
‘అక్షరాభ్యాసం’కు జాతీయ పురస్కారం
ఆకివీడు: జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన 2024 లఘుచిత్రాల జాతీయ పురస్కారాల కార్యక్రమంలో ఆకివీడుకు చెందిన లఘు చిత్ర దర్శకుడు హరీష్ ఉండ్రమట్ల పురస్కారం అందుకున్నా రు. వీధి బాలల జీవనశైలి ఇతివృత్తంతో, విద్యకు దూరమవుతున్న బాలలపై చిత్రీకరించిన అక్షరాభ్యాసం లఘుచిత్రం సర్టిఫికేట్ ఆఫ్ స్పెషల్ మెన్షన్ జాతీయ పురస్కారానికి ఎంపికై ంది. అవార్డుతో పాటు రూ.50 వేల నగదును దర్శకుడు హరీష్ అందుకున్నారు.