ఫీజులు కట్టలేదని విద్యార్థుల నిర్బంధం
నరసాపురం రూరల్: ఫీజులు కట్టలేదనే కారణంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను గదిలో నిర్బంధించిన ఘటన వెలుగుచూసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం నరసాపురం–పాలకొల్లు జాతీయ రహదారిని ఆనుకుని సరిపల్లి పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తల్లితండ్రులు ధర్నా నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపుతో సంసిద్ స్కూల్ నిర్వహించడం దారుణమన్నారు. ఫీజుల కోసం విద్యార్థులను గదిలో బంధించడం బాలల హక్కులను కాలరాయడమే అ న్నారు. విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో పాఠశాల యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. స్కూల్‌కు వచ్చిన ఎంఈఓ పిల్లి పుష్పరాజ్యంకు ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు జి.శ్రీనివాస్ జి.రాజేష్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.చందు పి.ధనంజయ, పి.సురేష్, జి.ధీరజు తదితరులు పాల్గొన్నారు.