సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన కూటమి నేతలు.. అనేక హామీలను మ్యానిఫెస్టోలో పొందుపరిచి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కారు. ఆ తర్వాత వాటిని విస్మరించారు. అంతేగాక గతంలో ఉన్న పథకాలను సైతం తొలగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా పేదవాడి కడుపు నింపే రేషన్ బియ్యాన్ని సైతం ఎగ్గొట్టేందుకు రంగం సిద్ధం చేశారు.
ఏలూరు (మెట్రో): రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పంచదార, కందిపప్పు అందిస్తూ వైఎస్సార్‌సీపీ సర్కారు వాటిని ప్రజలకు ఇంటి వద్దకే పంపి అందించేది. తదనంతరం వచ్చిన కూటమి సర్కారు పేద ప్రజలకు అందించే రేషన్ సరుకులకు కూడా గండి కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కందిపప్పు పంపిణీని నిలిపివేసిన ప్రభుత్వం.. పంచదారను సైతం అరకొరగా అందిస్తోంది. లబ్ధిదారులకు ఇంటి వద్దే రేషన్ సరకులు అందించే ప్రక్రియను సైతం నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ–కేవైసీ పేరుతో రేషన్ పూర్తిగా ఎగ్గొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. రేషన్ కార్డుదారులు అందరూ ఈ–కేవైసీ పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా వేలిముద్రలు వేసి ఈ–కేవైసీ పూర్తిచేయాలని ప్రకటించడం చూస్తే.. రేషన్ కార్డులకు కోత విధించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా అర్థమవుతోంది.
ఇతర ప్రాంతాల్లో ఉన్నవారూ రావాల్సిందే..
ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఈ–కేవైసీ పూర్తి చేసుకోకుంటే సరకులు నిలిపివేసేందుకు కూటమి సర్కారు చర్యలు తీసుకోబోతోంది. ఇప్పటికే ఈ–కేవైసీ పూర్తికాని కార్డుదారుల జాబితాను డీలర్లకు అందజేసిన సర్కారు జిల్లాలో ఐదేళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారిని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ–పోస్ యంత్రంపై వేలి ముద్ర వేసి డీలర్ లాగిన్‌లో ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి సర్కారు చెబుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీ నాటికి ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలో ఉన్న ప్రజల వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి చిరుద్యోగాలు చేసుకుంటున్న, వలస వెళ్లిన, కూలి పనులు చేసుకుంటున్న వారిని సైతం రప్పించి ఈ–కేవైసీ పూర్తి చేయాల్సిందేనని ప్రకటిస్తున్నారు. దీంతో రేషన్ లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
రేషన్ నిలిచిపోతుందని లబ్ధిదారుల గగ్గోలు..
ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోకుంటే రేషన్ నిలిచిపోతుందేమోననే భయంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కందిపప్పు, పంచదార వంటి వాటిని దూరం చేశారని, ఇచ్చే బియ్యాన్ని సైతం దూరం చేసేందుకు ఈ–కేవైసీ ప్రక్రియ అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1123 రేషన్ షాపులు ఉండగా, 6,31,044 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 8791.03 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇక ప్రస్తుతం 1,50,089 మంది ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంది. వీరికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రేషన్ అందిస్తారో లేదో అనే సందిగ్ధంలో లబ్ధిదారులు ఉన్నారు.
ఈ–కేవైసీ పూర్తి చేసేందుకు చర్యలు
జిల్లాలో ఈ–కేవైసీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ–కేవైసీ ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 28వ తేదీ శుక్రవారం సాయంత్రానికి 94.5 శాతం ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తి చేశాం. ఇంకా 5.5 శాతం ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
– వై.ప్రతాప్‌రెడ్డి,
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, ఏలూరు
రేషన్ కార్డులపై కూటమి సర్కారు కన్నెర్ర
ఈ–కేవైసీ పేరుతో రేషన్ ఎగ్గొట్టే ప్రయత్నం
కార్డుదారుల్లో ఆందోళన