ఇఫ్తార్‌కు మేం రాం | - | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌కు మేం రాం

Published Sat, Mar 29 2025 1:10 AM | Last Updated on Sat, Mar 29 2025 1:08 AM

ఇఫ్తా

ఇఫ్తార్‌కు మేం రాం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రంజాన్‌ను పురస్కరించుకుని ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందును ముస్లిం సంఘాలు బహిష్కరించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేశాయి. ఏలూరులో శుక్రవారం రాత్రి స్థానిక గిరిజన భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించగా, తాము రాబోమని ముస్లిం సంఘాల నేతలు భీష్మించుకు కూర్చున్నారు. రాష్ట్రంలోని ముస్లిం మతానికి సంబంధించిన పెద్ద పెద్ద సంఘాల నాయకులంతా ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్‌ విందు కార్యక్రమాన్ని బహిష్కరించాలని పులుపునివ్వడం, స్థానిక మసీదుల్లో రెండు రోజులుగా బహిష్కరణపై ప్రకటనలు చేయడంతో ముస్లింలంతా ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. నగరంలో దాదాపు 40 వేల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో అధిక శాతం మంది నగరంలోని సుమారు 15 మసీదులకు రంజాన్‌ మాసంలో ప్రతి నిత్యం ప్రార్థనలకు వెళుతూ ఉంటారు. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు వల్ల ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతుందని, వారిలో అభద్రతాభావాన్ని పెంచుతున్న ఈ బిల్లును ఉపసంహరించుకునేలా రాష్ట్రంలోని ముస్లింల వాణిని కేంద్రానికి వినిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఇప్పటికే కోరారు. వారి వినతిని ఆయన పెడచెవిన పెట్టడంతో ముస్లింలు తమ ఐక్యతను చాటుకోవడానికి ఇఫ్తార్‌ విందు బహిష్కరణ మంచి వేదికగా ఉపయోగపడుతుందని భావించి ఆ మేరకు కృతకృత్యులయ్యారు.

బిల్లుతో ముస్లింల మనుగడ ప్రశ్నార్థకం..

ఇఫ్తార్‌ విందుకు ముందు ప్రభుత్వ ఖాజీ షేక్‌ హుస్సేన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్‌ మాస విశిష్టతను తెలిపారు. అనంతరం వక్ఫ్‌ బోర్డు జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఎస్‌ఎం అక్బర్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ సవరణ బిల్లు వల్ల దేశంలోని ముస్లింలు పూర్తి అభద్రతాభావంలోకి వెళ్లిపోయారని, ముస్లింల మనుగడను ప్రశ్నార్థకం చేసే ఈ బిల్లును అంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో ముస్లింలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారని, ఈసారి వారు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడానికి ప్రధాన కారణం వక్ఫ్‌ సవరణ బిల్లేనని వివరించారు.

రూ.3 లక్షల బడ్జెట్‌లో చాలీచాలని ఏర్పాట్లు

ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందుకు గతంలో కనీసం వెయ్యిమందికి తగ్గకుండా వచ్చేవారు. ఈ ఏడాది ప్రభుత్వం ఇఫ్తార్‌ విందుకు రూ.3 లక్షల బడ్జెట్‌ కేటాయించింది. ముస్లింలు ఇఫ్తార్‌ విందును బహిష్కరించడంతో పెద్దగా జనం కనిపించలేదు. మైనార్టీ శాఖ అధికారులు బహిష్కరణను దృష్టిలో పెట్టుకుని కేవలం 500 మందికే ఏర్పాట్లు చేసినట్టుగా ఆ శాఖకు చెందిన సిబ్బంది చెబుతున్నారు. ఈ విందుకు ముందు జరిగిన సమావేశానికి కేవలం సుమారు 30 మంది మాత్రమే ముస్లిం పెద్దలు హాజరయ్యారు. అక్కడ జనాభా కనిపించకపోవడంతో ముస్లిం పెద్దలు ఫోన్లు చేసి తమకు తెలిసిన వారిని విందుకు రావాలని పిలవడంతో మొత్తం మీద సుమారు 250 మంది విందుకు హాజరయ్యారు. వచ్చిన వారిలో కొంతమందికి ఆహార పదార్థాలు అందకపోవడంతో ఆగ్రహంగా వెళ్లిపోయారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూ.3 లక్షలు కేటాయిస్తే చాలీచాలని ఏర్పాట్లు చేశారని ముస్లింలు పెదవి విరిచారు.

వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ బహిష్కరించిన ముస్లింలు

సమావేశంలో బిల్లు విషయం కలెక్టర్‌ దృష్టికి

చంద్రబాబు వంచించారు

ఎన్నికలకు ముందు ముస్లింలకు అండగా ఉంటానని నమ్మబలికిన చంద్రబాబు గెలిచిన తరువాత బీజేపీతో కుమ్మకై ్క వక్ఫ్‌ సవరణ బిల్లుకు మద్దతు పలికి వంచించారు. ఇక నిర్వహించిన ఇఫ్తార్‌ విందులోనూ కనీస సౌకర్యాలు కల్పించలేదు. రంజాన్‌ మాసంలో సేమ్యా, స్వీట్‌ లేని ఇఫ్తార్‌ విందును ఇదే చూస్తున్నాం.

– షేక్‌ మస్తాన్‌ భాషా, అంజుమన్‌ ముహాఫిజుల్‌ ఇస్లాం సంస్థ సభ్యుడు

ఇఫ్తార్‌కు మేం రాం 1
1/1

ఇఫ్తార్‌కు మేం రాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement