ఏలూరు టౌన్: ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావటంతో స్థానికులకు ఏం జరిగిందో అర్థం కాని గందరగోళ పరిస్థితి ఎదురైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. వృద్ధురాలిని చంపేసి, పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు నిర్ధారించారు. ఏలూరు నగరంలో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ సమాచారం అందుకున్న పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుతో కలసి శుక్రవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆధారాల కోసం డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ బృందాన్ని రంగంలోకి దించారు.
చీటీ పాట డబ్బులే కారణమా?
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు వన్‌టౌన్ సత్యనారా యణపేటకు చెందిన చానాపతి రమణమ్మ (65) భర్త రాఘవులు మరణించటంతో చాలా కాలంగా ఒంటరిగా జీవిస్తోంది. ఇద్దరు కుమార్తెలు ఉండగా వారికి వివాహాలు అయ్యాయి. రమణమ్మ స్థానికంగా వడ్డీలకు అప్పులు ఇవ్వటం, చీటీలు కట్టించుకోవడం చేస్తోంది. ఇటీవల అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు ఆమె వద్ద చీటీలు వేసినట్టు తెలిసింది. అతను పెళ్లిళ్లలో డెకరేషన్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతను చీటీ పాడుకోగా దానికి సంబంధించిన సొమ్ము ఇచ్చే విషయంలో రమణమ్మ రోజూ తిప్పుకుంటోందంటూ నాలుగు రోజులుగా ఆమెతో గొడవ పడుతున్నాడు. గురువారం సాయంత్రం 7.30 గంటల సమయంలో రమణమ్మ ఇంటికి వెళ్లి తనకు డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఊరుకోనని గట్టిగా చెప్పి వెళ్లిపోయాడు. ఈలోగా రమణమ్మ కొంత సొమ్ము వేరే వారిని అడగగా.. ఆమె మనుమరాలు తీసుకువచ్చి రమణమ్మకు ఇచ్చి వెళ్ళింది. చీటీ పాడిన యువకుడికి డబ్బులు ఇవ్వాలని ఈ సందర్భంగా రమణమ్మ చెప్పినట్టు సమాచారం. రాత్రి 9.30 గంటలు దాటిన అనంతరం మరోసారి రమణమ్మ వద్దకు వెళ్ళిన ప్రసాద్.. డబ్బుల విషయంలో మరోసారి ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. పట్టరాని కోపంతో అతను వృద్ధురాలిని గట్టిగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ప్రసాద్ వృద్ధురాలి మెడలోని బంగారు నానుతాడు, బీరువాలోని కొంత నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసుల దృష్టి మళ్ళించేందుకు స్కెచ్
రమణమ్మ హత్య వ్యవహారంలో తనపైనే అనుమానం వస్తుందనే భయంతో ప్రసాద్.. దీనినుంచి తప్పించుకునేందుకు స్కెచ్ వేశాడు. అర్ధరాత్రి సుమారు 1.30 గంటలు దాటిన తర్వాత మళ్ళీ వృద్ధురాలి ఇంటికి వెళ్ళి ఆమె చేతులు, కాళ్ళను కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి, వెంట తీసుకువచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చోరీ చేసేందుకు వచ్చి ఆమెను ఎవరో చంపేసి వెళ్ళి ఉంటారనే రీతిలో పోలీసుల దృష్టి మళ్ళించేందుకు పథకం వేశాడు. ఉదయం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు నిందితుడు అదే ప్రాంతంలో సంచరించాడు. ఇందులో భాగంగా పోలీసులు దర్యాప్తు ఏ విధంగా చేస్తున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
ముఖంపై గట్టిగా కొట్టడంతో మృతి
కాళ్లు, చేతులు కట్టేసి.. పెట్రోల్ పోసి నిప్పు
చిట్టీల డబ్బు కోసమే.. గొడవ జరిగిందా?
ఏలూరు పోలీసుల అదుపులో నిందితుడు ?
పోలీసుల అదుపులో నిందితుడు?
వృద్ధురాలు రమణమ్మ హత్యకు గురికావటంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పర్యవేక్షణలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు వన్‌టౌన్ సీఐ జి.సత్యనారాయణ, ఎస్‌ఐ మదీనా బాషా, ఎస్‌బీ అధికారులు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారు. రాబరీ జరిగిందా? లేక చీటీ పాటలు వేస్తూ ఉండడంతో శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేక కుటుంబ కలహాలా? అనే కోణంలో పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కేసును సీరియస్‌గా తీసుకోవటంతో సాయంత్రానికే నిందితుడిని పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడు అదే ప్రాంతానికి చెందిన యువకుడిగా అనుమానం రావటంతో అతనితో పాటు కొందరిని విచారిస్తున్నట్టు తెలిసింది. వృద్ధురాలిని హత్య చేసి కాజేసిన నగదు, బంగారు ఆభరణాలను సైతం పోలీసులు రికవరీ చేసినట్టు తెలుస్తోంది.
వృద్ధురాలిని చంపి.. పెట్రోల్ పోసి నిప్పంటించి..