మాజీ మంత్రి కారుమూరి మండిపాటు
తణుకు అర్బన్, అత్తిలి: ప్రశాంతంగా ఉండే తణుకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఫ్యాక్షనిజాన్ని పరిచయం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్తిలి ఎంపీటీసీలను ఓటు హక్కు వినియోగించుకోనీయకుండా అడ్డుపడటం బాధాకరమని అన్నారు. అత్తిలిలోని తన నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అత్తిలిలో రౌడీ మూకలతో ఇళ్లపై దాడులు చేయించే పరిస్థితిని ఎమ్మెల్యే రాధాకృష్ణ తీసుకువచ్చారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీకి తిరుగులేని మెజార్టీ ఉండటంతో ఎంపీపీ ఉప ఎన్నికను నిలిపివేసే కుట్ర చేశారన్నారు. ఇంతచేసి నీవు ఏమి సాధించావంటూ ఆరిమిల్లిని ప్రశ్నించారు. ఇన్‌చార్జి ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ నాయకుడే ఉన్నా రని గుర్తుచేశారు. ఇప్పటికే తణుకు ప్రాంతాన్ని ఎమ్మెల్యే భ్రష్టుపట్టించారని, మద్యం ఏరులై పారిస్తున్నారని, పేకాట స్థావరాలు వెలిశాయని, క్రికెట్ బెట్టింగులు, గుండాటలతో యువతను చెడు మార్గంలో నడిచేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం రౌడీ మూకలతో తన ఇంటిని ముట్టడించారని, శుక్రవారం ఉపాధి హామీ కూలీలైన మహిళలను మీటింగ్ పేరుతో తీసుకొచ్చి తన వీధిలో నిలబెట్టారని ధ్వజమెత్తారు. వీటి ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారే తప్ప ఏం సాధించారంటూ మండిపడ్డారు. అత్తిలిలో తమ ఎంపీటీసీ సభ్యులు నీతికి, నిజాయతీకి కట్టుబడి ఉన్నారని, కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగలేదని కారుమూరి ఈ సందర్భంగా ప్రశంసించారు.
పసుపు చొక్కాలు వేసుకున్నట్టుగా పోలీసులు
టీడీపీ పసుపు చొక్కాలు వేసుకుని పోలీసు యంత్రాంగం విధులు నిర్వర్తిస్తున్నారని కారుమూరి ధ్వ జమెత్తారు. ఎన్నికల కేంద్రానికి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని, ఇంటి పైకి వచ్చి దాడులు చేస్తున్నా రని పోలీసు అధికారులకు ఫోన్‌లు చేస్తుంటే ఇదిగో అదిగో అన్నారని, తరువాత ఫోన్‌లు లిఫ్ట్ చేయడం మానేశారని చెప్పారు. లైవ్‌లో రాష్ట్ర డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు ఫోన్‌లు చేసి.. వారు స్పందించకపోవడాన్ని మీడియా సాక్షిగా చూపించారు. పోలీసుల తీరు ఇలా ఉందని, నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సా ధారణ మనుషులకు ఎలా న్యాయం చేయగలరని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.
ఇంటిపైకి వచ్చిన వారిని వదిలేది లేదు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్తిలిలో రౌడీమూకల దాడిచేసిన వైనాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కారుమూరి స్పష్టం చేశారు. న్యాయపరంగా కేసులు నమోదు చేసి తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే తన ఇంటిపైకి వచ్చిన రౌడీమూకలకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టానన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, వైస్ ఎంపీపీ అద్దంకి శ్రీను, ఎంపీటీసీ సభ్యులు రంభ సుజాత, సుంకర నాగేశ్వరరావు, దొమ్మేటి రమ్య, గుడిమెట్ల ధనలక్ష్మి, పురుషోత్తపు నాగేంద్ర శ్రీనివాస్, అడారి శ్రీనివాసరావు, దారం శిరీష, నల్లమిల్లి నాగమణి, సరకడం రామలింగ విష్ణుమూర్తి, కురాకుల లక్ష్మి, ముదునూరి దుర్గాభవాని, అన్నిశెట్టి త్రిమూర్తులు పాల్గొన్నారు.