జనసేన నాయకులపై చర్యలేవి? | - | Sakshi
Sakshi News home page

జనసేన నాయకులపై చర్యలేవి?

Apr 3 2025 2:25 AM | Updated on Apr 3 2025 2:39 AM

జనసేన నాయకులపై చర్యలేవి?

జనసేన నాయకులపై చర్యలేవి?

తణుకు అర్బన్‌: జనసేన నాయకులు తనను గదిలో నిర్బంధించి ఇష్టానుసారంగా దుర్భాషలాడారని చావే శరణ్యం అంటూ పోలీసులను ఆశ్రయించిన దువ్వ గ్రామ సచివాలయ బిల్లు కలెక్టర్‌ నీలం వెంకటలక్ష్మి వ్యవహారం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఇప్పటికే ఎస్సైకి డబ్బులు కొట్టాం.. సెక్షన్‌లు తీసిపడేశారు.. అన్న ఆడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈనెల 28న దువ్వ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఘటనపై అదే రోజు తణుకు రూరల్‌ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ బాధితురాలు ఈనెల 1న మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి జనవాణిలో దువ్వ జనసేన నాయకులు వేణు, చిన్నిలపై ఫిర్యాదు చేశారు. ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారేకానీ జనసేన నాయకులపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదంటూ బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతనెల 31న జిల్లా ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదుచేయగా ఎస్సై సచివాలయానికి వచ్చి విచారణ చేశారని, సీసీ ఫుటేజీ ఇప్పించమంటూ దరఖాస్తు చేశారని బాధితురాలు చెబుతున్నారు.

కూటమి నేతల అండదండలు

జనసేన నాయకుల తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయినా కూటమి నేతలు అండగా నిలవడం వివాదాస్పదంగా మారింది. మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే తాటతీస్తా అనే పార్టీ పట్టించుకోకపోగా, టీడీపీ శ్రేణులు కూడా వత్తాసు పలకడం గమనార్హం. ఇదిలా ఉండగా దువ్వలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణల పక్కనే వేణు, చిన్నిలను కూర్చోపెట్టుకోవడంతో వారికి ఇస్తున్న ప్రాధాన్యతపై ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇంటి చుట్టూ రెక్కీ..

తన ఇంటి చుట్టూ వేణు, చిన్ని అనుచరులు రెక్కీ నిర్వహిస్తున్నారని బాధితురాలు వెంకటలక్ష్మి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన నాయకుల నుంచి ప్రాణహాని ఉందని భయపడుతున్నారు. వారి అనుచరులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ హల్‌చల్‌ చేస్తున్నారని అవి కూడా వీడియోలు సేకరించానని, పోలీసులకు ఇవ్వనున్నట్టుగా స్పష్టం చేశారు. తనకు అండగా ఎవరూ లేకుండాపోయారని, ఎవరూ వెళ్లకూడదని జనసేన నాయకులు ఆంక్షలు విధిస్తున్నారని, రాజకీయ ఇబ్బందుల దృష్ట్యా ఉద్యోగుల సంఘం కూడా ముందుకు రాలేదంటూ వాపోయారు.

పోలీసుల క్లాస్‌

ఎస్సైకి డబ్బులు కొట్టాం.. సెక్షన్‌లు తీసిపడేశారు.. అని జనసేన మండల అధ్యక్షుడు చిక్కాల వేణు అన్నట్లుగా ఆడియో వైరల్‌ అవడంపై తణుకు రూరల్‌ పోలీసులు వేణు, చిన్ని ఇద్దరికీ క్లాస్‌ పీకినట్టుగా సమాచారం. ఈ ఘటనపై తణుకు రూరల్‌ ఎస్సై చంద్రశేఖర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేశామని, చిక్కాల వేణు, శ్రీరాములు చిన్నిలకు 41 నోటీసులు జారీచేశామని చెప్పారు.

వేణు, చిన్నిలను కాపు కాస్తున్న కూటమి

మహిళలను ఇబ్బందిపెడితే తాటతీస్తా అన్న పార్టీ సిద్ధాంతాలివేనా అంటున్న జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement