
మెట్ట.. నీటికి కటకట!
చింతలపూడి: భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఈ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదముంది. చెరువులు ఎండిపోయే దశకు చేరుకోగా బోర్లు, బావులు ఇప్పటికే అడుగంటిపోయాయి. ఈ పరిస్థితుల్లో మెటప్రాంత ప్రజానీకం తాగు, సాగునీటికి కటకటలాడే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చింతలపూడి నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆంధ్రా కాల్వ ఎండిపోయింది. ఎర్రకాల్వలు కూడా పూర్తిగా ఎండిపోయాయి. నియోజకవర్గంలో ఉన్న 450కి పైగా చెరువులు, కుంటలు ఏటా మేనెల వచ్చేసరికి నీరు ఇంకిపోతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం ముందుగానే చెరువులు వట్టి పోయే ప్రమాదం ఏర్పడింది.
ఆక్రమణలతో హరించుకుపోతున్న చెరువులు
గత ఏడాది డిసెంబర్ నెల నుంచి వర్షాలు పడకపోవడం, చెరువులు ఎండిపోవడానికి ఒక కారణమైతే, రైతులు దాళ్వా పంటలు వేయడం కూడా మరో కారణంగా చెప్తున్నారు. చింతలపూడి సబ్‌డివిజన్‌లో ఈ ఏడాది 8,228 ఎకరాల్లో రైతులు రబీ వరి సాగు చేపట్టారు. వీటికి తోడు చెరువుల ఆక్రమణలు కారణంగా కూడా నీరు నిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తుండటంతో ఆక్రమణలతో చెరువులు హరించుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడుతోంది. చెరువుల్లో నీరు ఎండిపోతుండటంతో పశువులకు తాగునీరు ఎలా అన్నదే ప్రస్తుతం రైతులను పట్టిపీడిస్తున్న సమస్య. మెట్టకు శాశ్వత సాగునీటి వసతి లేకపోవడం, కేవలం వర్షాలపైనే ఆధారపడ్డ చెరువులవల్ల ప్రతి ఏటా మనకు ఈ దుస్థితి ఏర్పడుతోందని ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు.
ఎండిన ఆంధ్రా, ఎర్ర కాలువలు
వట్టిపోతున్న బోర్లు.. అడుగంటిన బావులు
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం
గోదావరి జలాలను మళ్లించాలి
ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలను మళ్లించాలి. తద్వారా రైతులకు శాశ్వత సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలి.
– ఎస్‌కే కాలేష, రైతు సంఘం నాయకుడు, చింతలపూడి
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
చెరువుల్లో నీరు ఎండిపోవడంతో ప్రభుత్వం పశువుల తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువుల సమగ్ర సర్వే చేపట్టి ఆక్రమణలో ఉన్న చెరువులకు విముక్తి కలిగించాలి. ఉపాధిహామీ నిధులతో చెరువుల పూడికను పూర్తిస్థాయిలో తీయిస్తే వర్షాకాలంలో చెరువుల్లో నీరు నిల్వ చేసుకోవచ్చు. – దొంతా కృష్ణ, రైతు సంఘం నాయకుడు, రేచర్ల

మెట్ట.. నీటికి కటకట!

మెట్ట.. నీటికి కటకట!

మెట్ట.. నీటికి కటకట!