
ముమ్మరంగా దాళ్వా మాసూళ్లు
భీమవరం: అవరోధాలను అధిగమించి ఆరుగాలం కష్టించి దాళ్వా సాగుచేసిన రైతన్నలు పంట మాసూళ్లు పనుల్లో నిమగ్నమయ్యారు. సాగునీటి కొరత, తెగుళ్లు, ఎలుకల బెడదతో ఇబ్బందులు పడ్డా వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం, వీరవాసరం, పెంటపాడు, తణుకు, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో రైతన్నలు దాళ్వా మాసూళ్లు ప్రారంభించగా పీఆర్–126, ఎస్‌ఎల్–10 వంటి వరి రకాల కొట్టుపొట్టు ధాన్యం ఎకరాకు 60 నుంచి 70 బస్తాల వరకు దిగుబడి వస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో దాళ్వాసాగు చేయగా కొన్ని ప్రాంతాల్లో మాసూళ్లు ప్రారంభించారు.
సాగునీటి కొరత, తెగుళ్ల బెడద
దాళ్వా సాగు ప్రారంభం నుంచి కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సమస్య ఉత్పన్నం కావడంతో వంతుల వారీ విధానంలో నీరందించడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. అయినప్పటికీ మెరక ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందకపోవడంతో రైతులు మురుగు కాలువల్లోని నీటిని ఆయిల్ ఇంజిన్ల సహాయంతో చేలకు పెట్టుకుని పంటను కాపాడుకున్నారు. అలాగే తెగుళ్లు, ఎలుకల బెడదతో ఇబ్బందులు పడ్డారు.
6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
దాళ్వా పంటలో జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికిగాను 348 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతుసేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు ఇప్పటికే రెవెన్యూ డివిజన్ల వారీగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం తేమ ఉన్న ధాన్యం కొనుగోలులో సాధారణ రకం క్వింటాళ్లు ధాన్యం రూ.2,300, ఏ గ్రేడ్ రకం రూ.2,320 రైతులకు చెల్లిస్తారు. పంట మాసూళ్లు ప్రారంభం కావడంతో జిల్లాలో మొట్టమొదటి ఽరైతు సేవాకేంద్రాన్ని గురువారం తాడేపల్లిగూడెంలో ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో దాళ్వా వరిసాగు
అనుకూల వాతావరణంతో దిగుబడులపై ఆశలు
6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రభుత్వ లక్ష్యం
నేడు తాడేపల్లిగూడెంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
80 శాతం గింజలు గట్టిపడితే మాసూళ్లు చేయాలి
జిల్లా వ్యాప్తంగా దాళ్వా వరి పంట ఆశాజనకంగా ఉంది. ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో మాసూళ్లు ప్రారంభమయ్యాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో 80 శాతం గింజలు గట్టిపడిన తరువాతనే మాసూళ్లు చేయాలి. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం. – జెడ్ వెంకటేశ్వరరావు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి, భీమవరం

ముమ్మరంగా దాళ్వా మాసూళ్లు