
వాతావరణ మార్పులతో గుబులు
భీమవరం: ఆరుగాలం కష్టించి పండించిన దాళ్వా పంట చేతికి వచ్చే సమయంలో వాతావరణంలో మార్పులు రైతులను ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడం, జిల్లాలో ఈదురుగాలులు, చిరుజల్లులు పడటంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పీఆర్–126, ఎస్‌ఎల్–10 వంటి రకాలు మాసూళ్లు చేస్తుండగా ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉంది. వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా వరి మాసూళ్లు ముమ్మరం కానున్నాయి. దాళ్వా సీజన్ ప్రారంభంలో రైతులు సాగునీటి ఎద్దడి, పైరుపై చీడపీడలు, ఎలుకల బెడదతో ఇబ్బందులు పడ్డారు. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ దాళ్వా పంట పండించారు. ప్రస్తుతం దాదాపు అన్ని మండలాల్లో గింజలు ఎర్రముక్కులు పడే దశలో ఉండగా ముందుగా నాట్లు వేసిన రైతులు మాసూళ్లకు సన్నద్ధమవుతున్నారు. ముందుగా మాసూళ్లు చేసిన రైతులు కొట్టు, పొట్టు ధాన్యం ఎకరాకు 60 బస్తాలకు పైగా దిగుబడి వస్తున్నట్టు చెబుతుండటంతో మిగిలిన రైతులు దాళ్వా పంటపై ఆశలు పెట్టుకున్నారు.
ఉపరితల ఆవర్తనంతో ఆందోళన
అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా బలపడే అవకాశాలున్నందున కోస్తా జిల్లాలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. పగలు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా రాత్రిళ్లు ఈదురు గాలులు, చిరుజల్లులు పడుతున్నాయి. ఇప్పటికే ఎకరాకు సుమారు రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెట్టగా.. కోతలకు మరో రూ.5 వేలు ఖర్చవుతుందని, ఈ సమయంలో వర్షాలు పడితే తీవ్రంగా నష్టతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈదులుగాలులతో పైరు నేలనంటి గింజలు రాలిపోవడంతో మాసూళ్లు ఖర్చులు పెరిగిపోతాయంటున్నారు.
పగలు ఉక్కపోత.. రాత్రిళ్లు చిరుజల్లులు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
ఆందోళనలో వరి రైతులు
జిల్లాలో కోతకు సిద్ధంగా దాళ్వా పంట