
ఎమ్మెల్యే నాయకర్ వ్యాఖ్యలపై మండిపాటు
నరసాపురం: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సమక్షంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కా రుమూరి నాగేశ్వరరావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత పెండ్ర వీరన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయకర్ రౌడీయిజంలో కాకుండా, నియోజకవర్గ అభివృద్ధిలో తన టాలెంట్ చూపించాలని హితవు పలికారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి ఓ బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రిపై దుర్భాషలాడటం దారుణమన్నారు. నాయకర్ తీరుతో కూటమిలోని పార్టీలు, కార్యకర్తలకే నష్టమన్నారు. నియోజకవర్గంలో బీసీ రుణాలు కూటమి నాయకులు, కార్యకర్తలకు దక్కుతున్నాయని, నిష్పక్షపాతంగా అర్హులకు ఒక్కరికి రుణం ఇచ్చామని ఎమ్మెల్యే ధైర్యంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై ఎమ్మెల్యే మాట్లాడాలి గానీ బహిరంగ సభల్లో బూతులతో బెదింపులకు దిగడం ఏంటని ధ్వజమెత్తారు.
నియోజకవర్గ చరిత్రలో నాయకర్ మాత్రమే..
నరసాపురం నియోజకవర్గ చరిత్రలో ఎందరో మంత్రులుగా, కేబినెట్ హోదాల్లో పనిచేశారని, ఎవరూ నాయకర్‌లా నీచ సంస్కృతి జోలిక పోలేదని వీరన్న అన్నారు. రౌడీయిజం, బూతులు, బెదిరింపుల్లో నాయకర్ మొదటి ఎమ్మెల్యేగా నిలిచారని, ఇప్పటికై నా తీరు మార్చుకోవాలని అన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు, జెడ్పీటీసీ సభ్యుడు బొక్కా రాధాకృష్ణ, కౌన్సిలర్ యర్రా శ్రీను, నాయకులు బర్రి శంకరం, అ డ్డాల నర్సింహరావు, కూనపరెడ్డి నారాయణ, ని ప్పులేటి సత్యనారాయణ, మురాల చిన్న, కడలి అ బద్దం, పెదశింగు శంకరం పాల్గొన్నారు.