
గణాంకాలు సకాలంలో నమోదు చేయాలి
భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీఎంఅండ్‌హెఓ జి.గీతాబాయి అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మాతా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నూరు శాతం గణాంకాల నమోదుకు, లక్ష్య సాధనకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు భానునాయక్, డి.సుధాలక్ష్మి, వి.ప్రసాదరావు, జి.ధనలక్ష్మి పాల్గొన్నారు.
పీజీ సెంటర్‌లో ఎంసీఏ కోర్సు
నూజివీడు: పట్టణంలోని పీజీ కేంద్రంలో రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఎంసీఏ కోర్సు ఏర్పాటు చేస్తున్నామని కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కూన రాంజీ పేర్కొన్నారు. కృష్ణా యూనివర్శిటీకి చెందిన పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు పీజీ కేంద్రం ప్రధాన గేటు నిర్మాణానికి వైస్ చాన్సలర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన అకడమిక్ భవనాన్ని జులైలోగా పారంభిస్తామన్నారు. పీజీ కేంద్రానికి సోలార్ విద్యుత్ సదుపాయాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పీజీ కేంద్రం ప్రధాన భవనానికి హంగులు దిద్దేందుకు తగిన సూచనలు ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కోరామన్నారు. రాబోయే రోజుల్లో ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. పీజీ సెంటర్‌లో ల్యాబ్‌లు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీజీ కేంద్రం ప్రిన్సిపాల్ జే నవీన లావణ్యలత, అధ్యాపకులు పాల్గొన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) నారాయణ పేర్కొన్నారు. మేలో జరిగే సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్పెషల్ క్లాస్‌ల నిర్వహణను శనివారం డీఈఓ పరిశీలించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలపై సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల కోసం ఆహ్వానం, ప్రభుత్వ పథకాలు, పాఠశాలలో సౌకర్యాలు తదితర విషయాలపై చర్చించారు. విద్యా శాఖ కరపత్రాలను డీఈఓ ఆవిష్కరించారు. డీవైఈఓ ఎన్.శ్రీనివాసరావు, ఎంఈఓ హనుమ, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసు తనిఖీలు
భీమవరం: కశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడి దృష్ట్యా.. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాంబు గుర్తింపు బృందం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నేతృత్వంలో జిల్లాలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. హోటళ్లు, లాడ్జీలలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు తనిఖీ చేశారు. విస్తృత తనిఖీలకు జిల్లా ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనిస్తే తక్షణమే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.

గణాంకాలు సకాలంలో నమోదు చేయాలి

గణాంకాలు సకాలంలో నమోదు చేయాలి