
ప్రేమ పేరుతో మోసగించడం వల్లే ఆత్మహత్య
జీజీహెచ్ ముందు యువతి తల్లిదండ్రుల ధర్నా
ఏలూరు టౌన్/ముసునూరు : ఏలూరులోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోన్న యువతిని ప్రేమించి మోసం చేయటంతో ఆత్మహత్య చేసుకుందని.. ఆమె మృతికి కారణమైన వ్యక్తిని శిక్షించి తమకు న్యాయం చేయాలంటూ ఏలూరు సర్వజన ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు పురుగు మందు డబ్బాతో ధర్నాకు దిగారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి తమ కుమార్తె మరణానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పంతంగి నాగరాజు, రమాదేవికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె పంతంగి ఉమాశిరీష (23) బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రస్తుతం ఏలూరు నగరంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. నాగరాజు గ్రామంలో పంచాయతీ వాటర్‌వర్క్స్‌లో పనిచేస్తున్నారు. ఉమా శిరీష విజయవాడలోని హెల్ప్ హాస్పిటల్‌లో పనిచేస్తుండగా.. ముసునూరు మండలం విస్సన్నపేట ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కుమార్ అదే హాస్పిటల్‌లో పనిచేసేవాడు. వారిద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను కుటుంబ సభ్యులు నిరాకరించారని చెబుతుండగా, యువతి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను మోసం చేయటంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. శుక్రవారం స్వగ్రామంలో శిరీష పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక చికిత్స అనంతరం ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శిరీష శనివారం మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు ఏలూరు జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగటంతో వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు బాధితుల వద్దకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. టూటౌన్ సీఐ అశోక్‌కుమార్ సంఘటనపై ఆరా తీశారు. స్టేట్‌మెంట్ తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఆశలతో తమ కుమార్తెను బీఎస్సీ నర్సింగ్ చదివించామని.. ప్రేమ పేరుతో మోసం చేయటంతో ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని తల్లిదండ్రులు విలపించటం అందరినీ కలిచివేసింది.