
అకాల వర్షంతో ఇక్కట్లు
తాడేపల్లిగూడెం: ఆదివారం సాయంత్రం గూడెం ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఒకవైపు పూర్తి స్థాయిలో పంట ఎదిగి, కోతలు జరుగుతున్న వేళ కురిసిన ఈ వాన రైతులకు ఆందోళన కలిగించింది. బోర్ల కింద వ్యవసాయం చేసే గూడెం మండలంలో చినతాడేపల్లి నుంచి బంగారు గూడెం వరకు దాదాపుగా మాసూళ్లు పూర్తయ్యి, ధాన్యం అమ్మకాలు అయ్యిపోయాయి. మాధవరం ప్రాంతంలో కూడా మాసూళ్లు పూర్తిచేసుకుని రైతులు ఒబ్బిడి అయ్యారు. ఈ మండలంలో సుమారు 25 వేల ఆయకట్టులో వరి వేశారు. కాలువ కింద గ్రామాలైన కృష్ణాయపాలెం నుంచి నవాబుపాలెం, నందమూరు వరకు ఇంకా కోతలు ప్రారంభం కాలేదు. సుమారు 18 వేల ఎకరాల్లో కోతలు పూర్తి కావాల్సి ఉంది. నిటారుగా నిలబడే 1121 రకం కావడంతో ఆదివారం కురిసిన వానతో పంటకు పెద్దగా నష్టం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పనల మీద ఉన్న ధాన్యానికి కూడా అకాల వాన వల్ల ఇబ్బంది లేదు. పెంటపాడు మండలంలో సుమారు 21 వేల ఎకరాల ఆయకట్టులో వరి వేశారు. దీనిలో రెండు వేల ఎకరాల వరకు కోతలు పూర్తయ్యాయి. 19 వేల ఎకరాల్లో ఇంకా కోతలు పూర్తి కావాల్సి ఉంది. ఆదివారం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వాన పడటంతో రైతులు కంగారు పడ్డారు. కొద్దిసేపు వర్షం పడి ఆగడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వాన వల్ల పంటకు ఎలాంటి ఇబ్బంది లేదని తాడేపల్లిగూడెం సహాయ వ్యవసాయ సంచాలకుడు మురళీకృష్ణ తెలిపారు. గూడెం పట్టణంలో వానతో వాతావరణం చల్లబడడంతో ప్రజలు సేదదీరారు.
ఏజెన్సీలో గాలివాన బీభత్సం
బుట్టాయగూడెం: ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వర్షంతో పాటు గాలి బీభత్సం సృష్టించింది. పలు చోట్ల కొమ్మలు విరిగిపోయాయి. గాలులకు కరెంటుకు అంతరాయం కలిగింది. రాత్రి 8 గంటల వరకూ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్‌శాఖ అధికారులు కరెంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
కుక్కునూరులో ఈదురు గాలులతో వర్షం
కుక్కునూరు: కుక్కునూరు మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలంగా వీచిన గాలుల దాటికి మండలంలోని చిరవెల్లి గ్రామంలో తాటిచెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా గాలుల దాటికి మండల వ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

అకాల వర్షంతో ఇక్కట్లు

అకాల వర్షంతో ఇక్కట్లు