
61రోజులు..వేటకు విరామం
నరసాపురం: వేట బోట్లకు లంగరు పడనుంది. సముద్రంలో 61 రోజులపాటు వేట నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి. ఈ మేరకు మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు 61 రోజులపాటు వేట నిషేధం అమలుకానుంది. ఉభయగోదావరి జిల్లాల్లో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాకు చెందిన బోట్లు నరసాపురం తీరానికి తీసుకువచ్చి లంగరు వేస్తున్నారు. సోమ వారం రాత్రి 12 గంటల నుంచి జూన్ 14న అర్ధరాత్రి వరకు వేట సాగించే వీలులేదు. ఈ మేరకు అధికారులు తీరంపై ప్రత్యేక నిఘా పెట్టారు.
భరోసా అందేనా?
2019 నుంచి 2023 వరకూ వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం ఐదేళ్ల పాటు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు మత్స్యకార భరోసా పథకం కింద ఆర్థిక సాయం చేసింది. ఏడాదికి సగటున 1,635 మందికి 5 దఫాలుగా సొమ్ములు అందించింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఉపాధి లేక ఖాళీగా ఉంటారు. వీరి కుటుంబాలకు అండగా నిలిచేలా రూ.10 వేల చొప్పున మత్స్యకార భరోసా సా యాన్ని గత ప్రభుత్వం అందించింది. గత ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసా మొత్తాన్ని రూ.20 వేలకు పెంచుతామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అయితే 2024లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం గతేడాది సాయం అందించలేదు. దీంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు వేట నిషేధ సాయం అందక, మరోవైపు వరుస ప్రకృతి విపత్తులతో ఏడాదంతా సవ్యంగా వేట సాగక గంగపుత్రులు పాట్లు పడ్డారు. ఈ ఏడాదైనా కూటమి ప్రభుత్వం కనికరించి వేట నిషేధ భృతిని అందిస్తుందని మత్స్యకారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బకాయిలతో కలిపి రెండేళ్ల మత్స్యకార భరోసా సొమ్ములు అందించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
నేటి అర్ధరాత్రి నుంచి అమలు
సముద్ర తీరానికి చేరుకుంటున్న బోట్లు
గతేడాది మత్స్యకార భరోసాకు కూటమి ఎసరు
ఈ ఏడాది అయినా అమలు చేసేనా?