
దామరచర్లలో పోలీస్ పికెట్
కుక్కునూరు: మద్యం మత్తులో నలుగురి మధ్య జరిగిన గొడవ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు ఆదివారం దామరచర్లలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం మద్యం మత్తులో దామచర్ల గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. స్థానికులు వారిని వారించి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆదివారం స్థానికంగా ఉన్న పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టించి రాజీ చేయించారు. ఆదివారం మధ్యాహ్నాం మరోసారి ఇరు వర్గాల వ్యక్తులు మద్యం సేవించేందుకు ఒకే ప్రాంతానికి వెళ్లిన నేపథ్యంలో మళ్లీ ఘర్షణ పడ్డట్టు తెలుస్తుంది. ఓ వర్గానికి చెందిన వారు బీరుసీసాలతో మరోవర్గానికి చెందిన వారిపై దాడి చేయడంతో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. ఆ వ్యక్తి తరుపు బంధువులు రోడ్డుపై ఆందోళన చేసేందుకు సిద్ధపడగా పోలీసులు వారిని చెదరగొట్టారు. బాధితుడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సీఐ, ఎస్‌ఐ మరో ఇరవై మంది సిబ్బందితో కలిసి దామరచర్లలో పికెట్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరావు దామరచర్ల గ్రామాన్ని పరిశీలించారు.