
పెట్రోల్ బంకులో మోసంపై తహసీల్దార్‌కు ఫిర్యాదు
కాళ్ల: కాళ్ళ హెచ్‌సీ పెట్రోలు బంకులో ఘరానా మోసం బయటపడింది. రూ.100 పెట్రోలు కొట్టిస్తే కేవలం అర లీటరు పెట్రోల్ రావడంపై వినియోగదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే కాళ్ళ గ్రామానికి చెందిన ఎం.సూరిబాబు బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో దారిలో ఆగిపోయింది. దీంతో దగ్గరలో ఉన్న హెచ్‌పీ బంకుకు వెళ్లి ఖాళీ వాటర్ బాటిల్‌లో రూ.100 పెట్రోలు కొట్టించాడు. తీరా చూస్తే బాటిల్‌లో అర లీటర్ పెట్రోలు రావడంతో విస్తుబోయి మెషిన్‌ని చూడగా 0.91 లీ. అని వచ్చింది. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని నిలదీశాడు. అదే సమయంలో మరో వ్యక్తి వచ్చి బాటిల్‌లో పెట్రోల్ పట్టమనగా మళ్లీ అదేవిధంగా అర లీటరు మాత్రమే రావడంతో పెద్ద ఎత్తున వాహనదారులు బంకులో చేస్తున్న ఘరానా మోసంపై స్థానిక తహసీల్దార్‌కి ఫిర్యాదు చేశారు. పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లలో మోసాలు జరగకుండా తూనికలు, కొలతల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు కోరుతున్నారు.