
లిఫ్ట్ ఇచ్చి దోచేస్తారు.. జాగ్రత్త
తణుకు అర్బన్: లిఫ్ట్ ప్లీజ్ అని అడుగుతున్నారా.. ఎవరైనా లిఫ్ట్ ఇస్తానంటే ఎక్కుతున్నారా అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. గురువుగారూ ఎక్కడ దింపమంటారు అంటూ ద్విచక్ర వాహనం ఆగినా.. బాబూ కొంచెం పైసెంటర్‌లో దింపుతారా అని మీరే అడిగినా మీపై దాడులు చేయడం ఆపై మీ జేబులు గుల్లయ్యే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త.. లిఫ్ట్ ఇచ్చినవారు మంచి వారైతే క్షేమంగా ఇంటికి చేరే పరిస్థితి. లేదంటే వారి పని అంతేనన్నట్లుగా ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. దీంతో అపరిచిత వ్యక్తులు ఎవరైనా రోడ్డుపై ఆపి లిఫ్ట్ అడుగుతున్నా, లిఫ్ట్ ఇస్తామన్నా నమ్మలేని పరిస్థితి దాపురించింది.
నడి వయస్సు, వృద్ధులే లక్ష్యంగా..
కష్టపడలేక ఈజీ మనీకి అలవాటు పడుతున్న యువత ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. వాహనంలో లిఫ్ట్ ఇచ్చి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి గాయపరుస్తూ భయబ్రాంతులకు గురిచేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు, బ్యాంకు ఖాతాల్లోని నగదును సైతం దోచుకుంటున్నారు. ముఖ్యంగా నడి వయస్సు, వృద్ధులే లక్ష్యంగా ఈ దోపిడీ జరుగుతున్నట్లుగా బాధితవర్గాలు చెబుతున్నారు. అయితే సదరు దోపిడీదారులు చాలా భయానకంగా వ్యవహరిస్తున్నారని వాహనం నుంచి దించగానే మోకాళ్లపై కుర్చోపెట్టి మారణాయుధాలతో బెదిరించి లొంగని వారిపై దాడులకు పాల్పడుతున్నట్లుగా బాధితులు వాపోతున్నారు. ఇటీవల తణుకుకు చెందిన ఒక ప్రముఖ న్యాయవాది హైదరాబాద్‌కు వెళ్లి రాత్రి సమయంలో తణుకులో బస్సు దిగారు. ఇరగవరం రోడ్డులోని తన ఇంటికి వెళ్లేందుకు స్థానిక వెంకటేశ్వర థియేటర్ ప్రాంతంలో ఆటో కోసం ఎదురుచూస్తుండగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు తాము దింపేస్తామంటూ ఆయన్ను ఎక్కించుకుని కంపోస్టు యార్డు దగ్గరకు తీసుకువెళ్లి ఆయన దగ్గర ఉన్న రూ.1500 నగదు, సెల్ ఫోన్ దోచేశారు. బ్యాంకులో ఉన్న రూ. 2వేలు కూడా ఫోన్‌పే ద్వారా వారు బదిలీ చేసుకుని ఫోన్‌తో ఉడాయించారు. దీంతో మరుసటి రోజున ఆ న్యాయవాది పట్టణ పోలీసులను ఆశ్రయించారు.
కేసును ఛేదించిన పోలీసులు
పైడిపర్రు కేంద్రంగా నివాసం ఉంటూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరవాసరం మండలం నవుడూరు గ్రామానికి చెందిన యువకుడు, బుట్టాయిగూడెం మండలం రామచంద్రపురానికి చెందిన ఒక యువకుడు కలిసి పైడిపర్రులో నివాసం ఉంటూ తణుకు పరిసర ప్రాంతాల్లో ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పైడిపర్రు పరిధిలోని వైజంక్షన్‌లో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 2.87 లక్షలు విలువైన 41 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 స్మార్ట్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరు తణుకు పట్టణ పరిధిలో 3, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చోరీల్లో పాల్గొన్నట్లు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఈ తరహా చోరీల్లో బాధితుల్లో కొందరు పోలీసులను ఆశ్రయిస్తుండగా మరి కొందరు చెప్పుకోలేక ఇంటి దారి పడుతున్నారు. పోలీసు స్టేషన్‌లకు చేరని నేరాలు పదుల సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
లిఫ్ట్ ఇచ్చి దాడులకు తెగబడుతున్న దొంగలు
6 కేసులకు సంబంధించి ఇద్దరి అరెస్ట్
అపరిచిత వ్యక్తులను ఆశ్రయించవద్దు
ఎవరైనా రహదారుల్లో అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామంటే వద్దని చెప్పడమే మంచిది. లిఫ్ట్ ఇస్తానని వాహనం ఎక్కించుకుని దోపిడీ చేస్తున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. అపరిచిత వ్యక్తులను లిఫ్ట్ అడగకుండా ఉండడంతోపాటు, వాహనం ఎక్కండి లిఫ్ట్ ఇస్తానన్నా ఎక్కకుండా ఉండడమే క్షేమం. ఎవరిపైన అయినా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – ఎన్.కొండయ్య, తణుకు పట్టణ సీఐ

లిఫ్ట్ ఇచ్చి దోచేస్తారు.. జాగ్రత్త