
ముస్లిం నేతల రిలే దీక్ష
కై కలూరు: వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీనిని వ్యతిరేకించాలని పలువురు ముస్లిం సోదరులు చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం – 2025ని నిరసిస్తూ కై కలూరు పెద్ద మసీదు వద్ద ముస్లిం నాయకుడు షేక్ షాబుద్దిన్ ఆధ్వర్యంలో ఒక రోజు రిలే దీక్షను బుధవారం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు దీక్ష సాగింది. ముస్లింల మనోభావాలు దెబ్బతిసే చట్టాన్ని రద్దు చేయడానికి చేస్తున్న నిరసనలలో ప్రజాస్వామ్య, లౌకికవాదులందరూ మద్దతుగా రావాలన్నారు. ముస్లిం నాయకులు మహమ్మద్ గాలీబ్ బాబు, షేక్ ఆరిఫ్, అబ్దుల్ హమీద్, అబ్దుల్ అలీమ్, మహమ్మద్ రఫీ, అమీర్, షేక్ రఫీ, అబ్దుల్ హసీబా, ఫిర్దోస్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ ,ఆసిఫ్, జహంగీర్, సుల్తాన్, భాష, మున్నా తదితరులు పాల్గొన్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్‌కు బుకింగ్ ప్రారంభం
ఏలూరు(మెట్రో): దీపం–2 కింద రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియలో ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండో సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారన్నారు. మొదటి విడత 2024 నవంబర్‌లో మొదలై ఈ ఏడాది మార్చి 31తో ముగిసిందన్నారు.