
ఇంజినీరింగ్‌దే హవా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దాదాపు దశాబ్ద కాలానికి పైనుంచే విద్యార్థులు సాంకేతిక విద్యబాట పట్టారు. గతంలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తరువాత డిగ్రీ కోర్సుల్లోకి ప్రవేశించడం సంప్రదాయంగా వచ్చింది. అనంతర కాలంలో ప్రపంచం మొత్తం మీద వచ్చిన సాంకేతిక విప్లవం ఆధారంగా కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే ఎక్కువగా జీతాలు వచ్చే అవకాశం ఈ రంగంలో ఉండడంతో విద్యార్థులు సైతం సాంకేతిక విద్యపై ఆకర్షితులయ్యారు. దీనితో ఇంజినీరింగ్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల హవా నడుస్తోంది. ఇంటర్మీడియెట్ అనంతరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించడం కోసం ప్రభుత్వం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలను ఏపీఈఏపీ సెట్ పేరిట నిర్వహిస్తోంది. ఇటీవల ఇంటర్మీడియెట్ ఫలితాలు వెల్లడి కావడంతో విద్యార్థులంతా ఈఏపీ సెట్‌కు సిద్ధమౌతున్నారు.
మే 19 నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు
2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశించే వారి కోసం మే 19వ తేదీ నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. షెడ్యూల్‌లోని ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలు రాయడానికి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ వరకూ గడువు ఉంది.
ఉమ్మడి పశ్చిమలో 13,330 సీట్లు
ఇంజినీరింగ్ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో కలిపి వివిధ కోర్సులకు సంబంధించి 13,330 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, రామచంద్ర కళాశాలలో 900 సీట్లు, ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలో 600 సీట్లు, హేలాపురి కళాశాలలో 360 సీట్లు, ఆగిరిపల్లిలోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో 1360 సీట్లు, నూజివీడులోని సారధి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాలలో 1,860, శ్రీ విష్ణు మహిళా కళాశాలలో 960, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో 1,140, భీమవరం ఇంజినీరింగ్ కళాశాలలో 300, నరసాపురంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో 1,620, తాడేపల్లిగూడెంలోని శ్రీవాసవి కళాశాలలో 1,200, శశి ఇంజినీరింగ్‌లో 1,140, నల్లజర్లలోని వైస్ ఇంజినీరింగ్‌లో 270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక మరో 10 శాతం సీట్లు అంటే 1333 సీట్లు ఈడబ్ల్యూస్ కోటాలో కేటాయిస్తారు. అంటే మొత్తం కలిపి 14,663 సీట్లు ఈ రెండు జిల్లాల్లోని కళాశాలల్లో అందుబాటులో ఉంటాయి.
ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ
ఈ పరీక్షలకు గత సంవత్సరం మాదిరిగానే ఇంటర్మీడియెట్‌లో అభ్యర్థి సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు. ఈఏపీ సెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి మొత్తం కలిపిన తరువాత ర్యాంకును ప్రకటిస్తారు. ప్రస్తుతం దరఖాస్తులు చేస్తున్న ఉరవడి పరిశీలిస్తే గత ఏడాది కంటే మరో 10 శాతం దరఖాస్తులు పెరగనున్నట్టు ఈ పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్‌టీయూ కాకినాడ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈఏపీ సెట్‌లో ప్రధానంగా కంప్యూటర్ ఆధారిత కోర్సులకే విద్యార్థుల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గత ఏడాది వరకూ తెలంగాణ విద్యార్థులకు నాన్‌లోకల్ కేటగిరీ కింద 15 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవారు. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినందున ఈ ఏడాది నుంచి వారికి రిజర్వేషన్ వర్తించదు. కాబట్టి మొత్తం సీట్లలో స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారు. దీనివల్ల ఆంధ్ర విద్యార్థులకు కొద్దిగా పోటీ తగ్గనుంది.
మే 19 నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు
తొలి రెండు రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు
మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాలకు పరీక్షలు
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 14 ఇంజనీరింగ్ కళాశాలలు
అందుబాటులో 13,330 సీట్లు
ఉత్తీర్ణులైతేనే ఫీజు రీయింబర్స్‌మెంట్
ఈఏపీసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఫీజు రీయింర్స్‌మెంట్ పథకం వర్తిస్తుంది. 160 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షకు 40 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్టే. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆశించే విద్యార్థులు ముందుగానే ఇన్‌కం ట్యాక్స్ సర్టిఫికెట్, ఈ ఏడాది తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్ కోటా (ఈడబ్ల్యూఎస్)లో చేరే విద్యార్థులు ముందుగానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను పొందిఉండాలి. పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో తమపేరు అక్షరం కూడా తప్పులేకుండా ఉండేలా జాగ్రత్తపడాలి. – పీ బాలకృష్ణ ప్రసాద్, ఈఏపీసెట్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్

ఇంజినీరింగ్‌దే హవా