
చిక్కుముడిగా వంతెన నిర్మాణం
పోలవరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అధికారులు
పోలవరం రూరల్: మహారాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు శనివారం పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. మహారాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి సంజయ్ బెల్సారే, గోదావరి నది నిర్వహణ ఔరంగాబాద్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ తీర్మన్వర్, జలవనరులవిభాగం పుణె చీఫ్ ఇంజనీర్ హనుమంత్ గుణాలే, సీడీఓ నాసిక్ విభాగం చీఫ్ ఇంజనీర్ ఆశీష్ డియోగడే పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమలను సందర్శించారు. పోలవరం ప్రాజెక్ట్‌లో స్పిల్ వే, స్పిల్ వే గేట్లు, ఫిష్ లేడర్, ఎగువ, దిగువ కాఫర్ డామ్స్, డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతం, పోలవరం జల విద్యుత్తు కేంద్రం తదితరాలను వీరు ఆసాంతం పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, దాని నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలు, మెటీరియల్ వివరాలను సీఈ నరసింహమూర్తి వారికి వివరించారు. పోలవరం ప్రాజెక్టులో ఫిష్ లేడర్ ప్రత్యేకతను ఏపీ జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేకంగా వివరించారు. వరద సమయంలో పులస చేప గోదావరి నదికి ఎదురీదుతూ వస్తుందని, ప్రత్యేకంగా ఆ చేపల కోసమే ఫిష్ లేడర్ నిర్మించామని, దేశంలో మరెక్కడా ఇలాంటి నిర్మాణం లేదని మహారాష్ట్ర అధికారులకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి మహారాష్ట్ర అధికారులు పట్టిసీమ ఎత్తిపోతల పథకం సందర్శించారు. అక్కడ పంప్ హౌస్, ఫోర్ బేలను పరిశీలించారు. అనంతరం అధికారులను ప్రాజెక్ట్ సీఈ కె.నరసింహమూర్తి శాలువా కప్పి సత్కరించారు. ఈఈ డి.శ్రీనివాస్, ఏఈఈలు పద్మకుమార్, అనిల్ కుమార్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్‌బాబు అంగర, డీజీ ఎం.మురళి పమ్మి పాల్గొన్నారు.
భీమడోలు: గోదావరి కాల్వపై నిర్మిస్తున్న కొత్త వంతెన నిర్మాణ పనులు సాంకేతిక కారణాల రీత్యా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జల రవాణా శాఖ ఈ వంతెన నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో స్లాబ్ దశలో ఉన్న పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గోదావరి కాల్వపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి పాత వంతెన రెండున్నర సంవత్సరాల క్రితం కూలిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏడాదిన్నర క్రితం కాల్వపై నిర్మించిన తాత్కాలిక బెయిలీ వంతెనపై భారీ వాహనాల రాకపోకలతో వంతెన శిథిలావస్థకు చేరింది. గత కొంతకాలంగా బెయిలీ వంతెనపై ఉన్న ఇసుప ప్లేట్లు తుప్పు పట్టడంతో పాటు నట్లు ఊడిపోయాయి. దీంతో ప్లేట్లు గతి తప్పి చిన్న వాహనం వెళ్లినా భారీ శబ్దాలతో దడ పుట్టిస్తున్నాయి. కాలం చెల్లిన తాత్కాలిక వంతెనపై ప్రయాణం బిక్కుబిక్కుమంటూ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వంతెనపై రాకపోకలు సాగించే భీమడోలు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ వంతెన కూలేందుకు సిద్ధంగా ఉండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కొల్లేరు గ్రామాల వారికి ఇదే ప్రధాన ద్వారం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాల నుంచి జాతీయ రహదారికి రావడానికి ఈ వంతెనపై నుంచి వెళ్లాల్సిందే. అలాంటి వంతెనపై భయం భయంగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఈ సమస్యను భీమడోలు ఏఎంసీ మాజీ చైర్మన్ వగ్వాల భాస్కర్ సంబంధిత ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ అండ్ బీ శాఖ వద్ద నిధుల కొరత తీవ్రంగా ఉందని, బెయిలీ వంతెన మరమ్మతులకు పంచాయతీ నిధులు కేటాయించాలని ఆర్ అండ్ బీ అధికారి పంచాయతీకి లేఖ రాశారు. దీంతో తాత్కాలిక వంతెనకు మరమ్మతులు పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా నిర్మించిన బెయిలీ వంతెనపై ఎన్నాళ్లు పాట్లు పడాలంటూ స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక అడ్డంకులు తొలగించి శాశ్వత వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్థానిక వార్తలు
గుండుగొలనులో కొత్త బ్రిడ్డి నిర్మాణానికి సాంకేతిక అడ్డంకులు
కూలేందుకు సిద్ధంగా బెయిలీ వంతెన

చిక్కుముడిగా వంతెన నిర్మాణం

చిక్కుముడిగా వంతెన నిర్మాణం