
ఉత్తమ ప్రదర్శనగా ‘ఇది అతని సంతకం’ నాటిక
భీమవరం: పట్టణంలో కళారంజని నాటక అకాడమీ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహించిన 14వ జాతీయస్థాయి నాటిక పోటీల్లో గుంటూరు వారి అభినయ ఆర్ట్స్ ‘ఇది అతని సంతకం’ నాటిక ప్రథమ బహుమతిని గెల్చుకుంది. అంతేకాకుండా ఈ నాటిక నుంచే ఉత్తమ నటనకు, దర్శకత్వానికి ఎన్ రవీంద్రరెడ్డికి ఉత్తమ సంగీతానికి లీలామోహన్ బహుమతులు అందుకున్నారు. విజేతల వివరాలను న్యాయనిర్ణేతలు గంటా రామ్మోహనరావు, అల్లు రామకృష్ణ, గంటా ముత్యాలరావునాయుడు శనివారం విలేకర్లకు తెలిపారు. ఉత్తరాంధ్ర సౌజన్య కళాప్రవంతి వారి దేవరాగం నాటిక ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా బహుమతి అందుకుంది. ఉత్తమ నటనకుగాను బీఎస్‌ఎస్ శివ (దేవరాగం), వరప్రసాద్ (అనస్వరం), మంజునాఽథ్ (హక్కు), జ్యోతిరాణి (దేవరాగం), బహుమతులు గెల్చుకోగా ఉత్తమ రచనకు దేవరాగం నాటికి రచయిత కేకేఎల్ స్వామి, ఉత్తమ ఆహార్యం తితిక్ష నాటిక, ఉత్తమ రంగాలంకరణ తితిక్ష నాటికకు టి బాబురావు బహుమతులు అందుకున్నట్లు న్యాయనిర్ణేతలు తెలిపారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కళారంజని నాటక అకాడమీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జవ్వాది దాశరథి శ్రీనివాస్, మెంటే పూర్ణచంద్రరావు, గుండా రామకృష్ణ, మల్లుల సీతారామ్‌ప్రసాద్, పులగం శివనాగనర్సింహరావు పాల్గొన్నారు.