
పిఠాపురంలో వెలివేసిన దళిత కుటుంబాలను ఆదుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో అగ్రవర్ణాలకు చెందిన వారు వెలివేసిన దళితులను ఆదుకోవాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఇలా జరగడం శోచనీయం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ య్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలివేసిన దళితులను ఆదుకుని, ఈ నేరానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉన్నమట్ల యేసురత్నం, సుంకర ప్రియబాబు, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చోరీ కేసులో ఆరుగురి అరెస్ట్
ఉంగుటూరు: చోరీ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం రాచూరు, చుట్టుపక్కల గ్రామాల చెరువుల మీద మేత బస్తాలు చోరీ జరుగుతున్నాయని చెరువుల యజమాని నడింపల్లి రామాంజనేయ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు సీతారాంపురానికి చెందిన బైరపూడి హరికృష్ణ, వనపర్తి సహదేవుడు, తాడేపల్లి వెంకట కుమార్, జుత్తుక ధనుష్, జుత్తుక పవన్ కుమార్, నబిగేరి జయరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సూర్యభగవాన్ చెప్పారు.