
ప్రభుత్వాసుపత్రి మార్చురీలో కొత్త దందా
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని మార్చురీ అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో మృతదేహాలతో అక్రమ వ్యాపారం సాగించిన సిబ్బంది.. తాజాగా మరో వ్యాపారానికి తెరదీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్చు రీలోని ఫ్రీజర్ బాక్సులు పనిచేయటం లేదు. రెండ్రోజుల క్రితం దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన లింగాల పరశురాం విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్‌లో మార్చురీకి తరలించగా ఫ్రీజర్ బాక్సులో పెట్టారు. సాయంత్రానికి మృతదేహం దుర్వాసన రావడంతో బంధువులు నిలదీశారు. మార్చురీ సిబ్బంది వారిపై ఎదురుదాడికి దిగారు. మీకు అవసరమైతే వెళ్ళి ఫ్రీజర్ బాక్సు తెచ్చుకుని పెట్టుకోండి? అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
ఇంత జరుగుతున్నా స్పందించని అధికారులు
ఏలూరు జీజీహెచ్‌లో మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ బాక్సులు పనిచేయకపోవటంతో సిబ్బంది కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారంటున్నారు. వారే ప్రైవేటు ఫ్రీజర్ బాక్సులు పురమాయిస్తారు. రోజుకి రూ.3 వేల నుంచి రూ.3,500 చెల్లిస్తే ఫ్రీజర్ బాక్సు తీసుకొచ్చి దానిలో మృతదేహాన్ని భద్రపరుస్తారు. ఇంత జరుగుతున్నా మెడికల్ కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందో అర్థం కావడం లేదని పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది ఈ తరహాలో వ్యాపారం చేస్తుంటే అధికారులకు తెలియదా? లేక వారికీ దీనిలో వాటాలు ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా అక్రమ వ్యాపారం సాగిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా? అని మృతుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
పనిచేయని ఫ్రీజర్ బాక్సులు
రూ. 3 వేలు ఇస్తే ఫ్రీజర్ బాక్సు పురమాయింపు