యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తులు నిర్వహించే వెండి మొక్కు జోడు సేవలను వచ్చే నెల 3వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వెండి మొక్కు జోడు సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు.
పురాతన శివలింగం చోరీ
మిర్యాలగూడ: దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో సుమారు 1350 సంవత్సరాల క్రితం నాటి శివలింగం గురువారం రాత్రి అపహరణకు గురైంది. బొత్తలపాలెం గ్రామంలో గల బైరవాని చెరువు కట్టపై కాకతీయ రెడ్డిరాజు నిర్మించిన శివాలయం శిథిలం కాగా.. గ్రామస్తులు శివలింగానికి పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 11 గంటల వరకు కూడా శివలింగం ఉందని, ఉదయం సమయంలో శివలింగం కనిపించలేదని చెరువు కాపలాదారులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో శివాలయం వైపు ఒక ఆటో వెళ్లినట్లు గ్రామస్తులు గుర్తించారు. కాగా.. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రవికుమార్ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జూదరుల అరెస్టు
గరిడేపల్లి : గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం గ్రామంలో చెరువు కట్ట వద్ద పేకాట ఆడుతున్న నలుగురిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి నాలుగు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లు, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరితోపాటు పరారైన వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కొండల్‌రెడ్డి తెలిపారు.
గేదెను ఢీకొన్న బైక్..ఒకరు మృతి
పెద్దవూర: బైకుపై వెళ్తున్న వ్యక్తి గేదెను ఢీకొన్న ఘటనలో గాయాలపాలై చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పెద్దవూర ఎస్‌ఐ పచ్చిపాల పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ రామంతపూర్‌కు చెందిన బొల్లెపల్లి శ్రీహరిరాజు (46)తన బైక్‌పై హాలియా నుంచి లింగంపల్లి గ్రామశివారులోగల తమ బత్తాయి తోటకు గురువారం రాత్రి 8.30గంటల సమయంలో వస్తున్నాడు. పెద్దవూర మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం వద్ద అకస్మాత్తుగా రోడ్డుపైకి గేదె రావడంతో దానికి ఢీకొట్టాడు. బైక్ పైనుంచి కిందపడిన రాజు తలకు, చేతులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి అన్న బొల్లెపల్లి శ్రీనివాసరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Published Sat, Feb 25 2023 11:32 AM | Last Updated on Sun, Feb 26 2023 6:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment