వంతెనకు మోక్షం ఎప్పుడు! | - | Sakshi
Sakshi News home page

వంతెనకు మోక్షం ఎప్పుడు!

Published Sat, Feb 8 2025 7:43 AM | Last Updated on Sat, Feb 8 2025 7:43 AM

వంతెన

వంతెనకు మోక్షం ఎప్పుడు!

ఆలేరురూరల్‌ : ఆలేరు– కొలనుపాక వాగుపై ప్రతిపాదించిన వంతెన కలగానే మిగిలింది. ఏడాది క్రితం నిధులు మంజూరై కాంట్రాక్ట్‌ సంస్థతో ఒప్పందం కుదిరినా పనుల్లో నేటికీ ముందడుగు పడలేదు. ఫలితంగా వరదొచ్చినా ప్రతీసారి ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో వాగు దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాగు దాటుతున్న క్రమంలో ఎంతోమంది కొట్టుకుపోయారు. వంతెన నిర్మాణమే సమస్యకు పరిష్కారం అని తెలిసినా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు.

పలు జిల్లాలకు ప్రధాన మార్గం

కొలనుపాక, రాఘవాపురం బైరాంనగర్‌, గ్రామాల్లో 2,500పైన కుంటుంబాలు ఉంటాయి. వీరంతా తమ అవసరాల నిమిత్తం ఆలేరు పట్టణానికి వచ్చి వెళ్తుంటారు. అంతేకాకుండా రాజాపేటతో పాటు జనగామ జిల్లా బచ్చన్నపేట, పోచన్నపేట, చేర్యాల, సిద్ధిపేటకు ఇది ప్రధాన మార్గం. నిత్యం వందలాదిగా వాహనాలు వాగుపై నుండే రాకపోకలు సాగిస్తుంటాయి.

రూ.4.50 కోట్లు మంజూరు

వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. బ్రిడ్జి నిర్మాణానికి జీఎచ్‌కే సంస్థతో 11 నెలల క్రితం ఒప్పందం కుదిరింది. కానీ, నేటికీ పనులు ప్రారంభం కాలేదు. అధికారంలోకి వస్తే బ్రిడ్జి నిర్మిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా కార్యరూపం దాల్చలేదు. సమస్యను ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ప్రజలు వాపోతున్నారు.

20 రోజులుగా వరద ఉధృతి

మల్లన్నసాగర్‌ నుంచి కొంతకాలంగా గోదావరి జలాలు విడుదల చేస్తున్నారు. కొలనుపాక వాగులోకి పెద్ద ఎత్తున నీరు చేరుతుండడంతో కల్వర్టు పైనుంచి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర పరిస్థితిలో వాగు దాటేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల మూడు రోజుల వ్యవధిలోనే ఐదుగురు వాగులో కొట్టుకుపోగా స్థానికులు రక్షించారు. ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి.

జరిగిన ప్రమాదాల్లో కొన్ని ఇవీ..

● ఉపాధ్యాయురాలు స్కూటీపై ఆలేరుకు వస్తూ వాగు దాటే క్రమంలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

● శ్రీకాంత్‌ అనే యువకుడు బైక్‌తో సహా కొట్టుకుపోతుండగా పోలీసులు కాపాడారు.

● బచ్చన్నపేటకు చెందిన వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై వాగు దాటుతుండగా నీటి ఉధృతికి లోలెవల్‌ బ్రిడ్జిపై నుంచి దిగువకు పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణికులు వారిని రక్షించారు.

● కొలనుపాకకు చెందిన యువకుడు ఆలేరు వస్తుండగా బైక్‌తో సహా వాగులో పడిపోవడంతో గాయాలయ్యాయి.

● బచ్చన్నపేట మండలానికి చెందిన దంపతులు స్కూటీపై వాగులో పడి గాయాలయ్యాయి,

● ప్రయాణికులతో వెళ్తున్న కొలనుపాకకు చెందిన ఆటో నీటి ఉధృతికి కొట్టుకపోయింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న పలువురు గాయపడ్డారు.

● ఆలేరుకు చెందిన సందెన రామనర్సయ్య, అతని భార్య లక్ష్మి బైక్‌పై పోచన్నపేటకు వెళ్లి వస్తుండగా వాగులో స్కూటర్‌తో సహా కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్‌లో జనగాం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

●హైదరాబాద్‌లోని బండ్లగూడకు చెందిన దంపతులు మద్దూర్‌లో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా నీటి ఉధృతికి లోలెవల్‌ బ్రిడ్జి కిందకు కొట్టుకుపోయారు. ఇద్దరికీ గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

● యువకుడు ఆలేరు నుంచి కొలనుపాకకు వెళ్తుండగా వాగులో పడి కాలు విరిగింది.

ఆలేరు – కొలనుపాక వాగుపై కలగానే హైలెవల్‌ బ్రిడ్జి

ఏడాదిన్నర క్రితమే నిధులు మంజూరు

నేటికీ మొదలు కాని పనులు

వరదొచ్చినా వాగుదాటాల్సిందే

ప్రమాదాల బారిన ప్రయాణికులు

వాగు దాటలేకపోతున్నాం

గోదావరి జలాలు కొలనుపాక వాగు కల్వర్టుపైనుంచి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతవాసులం ఏచిన్న పనికై నా ఆలేరుకు వెళ్లాలి. వాగుదాటాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నాం. జనగామ, సిద్ధిపేట జిల్లాలకూ ఇది ప్రధాన మార్గం. వాగుపై వంతెన నిర్మించాలి. – గంగుల శ్రీనివాస్‌, ప్రయాణికుడు

No comments yet. Be the first to comment!
Add a comment
వంతెనకు మోక్షం ఎప్పుడు!1
1/2

వంతెనకు మోక్షం ఎప్పుడు!

వంతెనకు మోక్షం ఎప్పుడు!2
2/2

వంతెనకు మోక్షం ఎప్పుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement