
నృసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళాలతో అర్చించారు. అనంతరం ప్రథమ ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తరం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
నేత్రపర్వంగా ఊంజల్ సేవ
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. మహిళలు అమ్మవారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరం వినిపించారు.
విలువలతో కూడిన విద్యను అందించాలి
ఆలేరురూరల్ : విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సూచించారు. శుక్రవారం ఆలేరులో వీఆర్ జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని చదవాలన్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వారి కలలను సాకారం చేస్తే సమాజం మీకంటూ గొప్ప పేరు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.అయ్యప్ప, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, ఎంఏ ఎజాజ్, గందమల్ల అశోక్, ఎండీ సలీం, తుంగకుమార్, బుగ్గ నవీన్, ఉపాధ్యాయులు, కమలాకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నృసింహుడికి సంప్రదాయ పూజలు
Comments
Please login to add a commentAdd a comment