
ఖిలా చరిత్రను భావితరాలకు అందజేస్తాం
భువనగిరి : భారతీయ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ కృషి చేస్తోందని, అందులో భాగంగా భువనగిరి కోట విశేషాలపై అధ్యయనం చేసి భావితరాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. శనివారం భువనగిరి ఖిలాను సందర్శించి కోటపై కట్టడాలను పరిశీలించారు. చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వారికి కోట చరిత్రను గైడ్ ఆవుల వినోద్, పర్వతారోహకురాలు అన్విత వివరించారు. ఖిలాను సందర్శించిన వారిలో సభ్యులు హరీష్, దుర్గ, శశాంక్, కిరణ్ తదితరలు ఉన్నారు.
కోడ్ ముగిసే వరకు ప్రజవాణి రద్దు
భువనగిరి టౌన్ : కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత తిరిగి ప్రజవాణి కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజలు గమనించి కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.
సీపీఐని కలుపుకుపోతాం
యాదగిరిగుట్ట : స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐతో సర్దుబాటు చేసుకుని, వారికి బలం ఉన్న చోట సీట్లు కేటాయిస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. శనివారం యాదగిరిగుట్టలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, మండలాల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవిధంగా ముందుకెళ్లాలనే విషయమై త్వరలో మరోసారి సమావేశమై చర్చిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రానుందని, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, చెక్క వెంకటేష్, ఉప్పల ముత్యాలు, మండల పార్టీ కార్యదర్శులు కల్లెపల్లి మహేందర్, చిగుళ్ల లింగం, మారుపాక వెంకటేష్, అన్నమైన వెంకటేష్, సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్, జిల్లా సమితి సభ్యుడు బబ్బూరి శ్రీధర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, జిల్లా సమితి సభ్యులు ఎల్లంకి మహేష్, బంగారి తదితరులు పాల్గొన్నారు.
సూపరింటెండెంట్‌గా బాధ్యతల స్వీకరణ
చౌటుప్పల్ : చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి ఇంచార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ కె.రాజగోపాల్ తిరిగి శనివారం బాధ్యతలు స్వీకరించారు. వివిధ కారణాలతో ఆయనను డిసెంబర్ 30న సస్పెన్షన్‌కు గురయ్యారు. హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. అతన్ని పోస్టింగ్‌లో నియమించాలని వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌తోపాటు డీసీహెచ్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాజగోపాల్ శనివారం ఆస్పత్రికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.
భాగ్యనగర్
ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు
భువనగిరి : సికింద్రాబాద్– కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 10నుంచి 20వ తేదీ వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. కాజీపేట–ఖమ్మం– విజయవాడ మధ్య మూడో లైన్ పనుల కారణంగా రైలును రైద్దు చేసినట్లు తెలిపారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగజ్‌నగర్ – సికింద్రాబాద్‌కు భువనగిరి మీదుగా రోజూ ఉదయం 8.44 గంటలకు, సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు సాయంత్రం 4.14 గంటలకు వెళ్తుంది. రైలును పునరుద్ధరించే వరకు భువనగిరితో పాటు జిల్లా ప్రజలు రవాణపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment