సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మంత్రి పదవులు ఆశిస్తున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేల ఆశ ఇప్పట్లో నెరవేరేలా లేదు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో అవసరం లేదని అధిష్టానం తేల్చిచెప్పినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించడం నిరాశను మిగిల్చింది.
అధిష్టానం హామీ ఇచ్చిందని..
మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఉమ్మడి జిల్లా నుంచి మునుగోడు నియోజవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఉన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించే బాధ్యతను రాజగోపాల్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు. ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు అప్పట్లో చర్చ జరిగింది. మొత్తానికి భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలిచారు. అప్పటి నుంచి తనకు మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని రాజగోపాల్‌రెడ్డి భావించినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు.
హోంమంత్రి పదవి ఇవ్వాలని..
మొదట్లో జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవులు లభించాయి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తోంది. ఒకానొక సందర్భంలో తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని, తాను హోంమంత్రి అయితేనే కేసీఆర్‌ను సమర్థంగా ఎదుర్కొంటానని రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
లంబాడా కోటాలో వస్తుందని..
ఎస్టీ లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు అవకాశం ఉంటుందనే చర్చ జో రుగా సాగింది. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన కోటాలో సీతక్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే లంబాడా కోటాలో మరొక మంత్రి పదవి ఇస్తారన్న చర్చ సాగింది. ప్రస్తుతం కేబినెట్ విస్తరణ అవసరం లేదని అధిష్టానం స్పష్టం చేయడంతో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు నిరాశ తప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment