
ఆర్‌ఓలు, ఏఆర్‌ఓల పాత్ర కీలకం
సాక్షి,యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సునంద సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు స్టేజ్–1, స్టేజ్–2పై అధికారులకు బుధవారం భువనగిరిలోని వెన్నెల కళాశాలలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె డీఆర్‌డీఓ నాగిరెడ్డితో కలసి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్ల రోజు మొదులకొని ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. హ్యాండ్ బుక్‌లను బాగా చదవాలన్నారు. మొత్తం 428 మంది శిక్షణలో పాల్గొన్నారు.మాస్టర్ ట్రైనర్లు కడారి నర్సిరెడ్డి, హరినాథ్‌రెడ్డి, చిత్తరంజన్, అశోక్, నరేందర్ రెడ్డి, తడక రాజు శిక్షణ ఇచ్చారు.
దిశానిర్దేశం చేసిన అంశాలు ఇవీ..
● పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలి.
● ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
● ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి.
● నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలి.
● సమయపాలన కోసం నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో గోడ గడియారం
అందుబాటులో ఉంచాలి.
● అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలి.
● నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులు రాకుండా, వారి ప్రతిపాదకులు వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
● ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే నామినేషన్ల ఉపసంహరణకు అనుమతించాలి.
● బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాలి.
● అభ్యర్థులు ఎన్ని సెట్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్లను తప్పనిసరిగా పరిశీలించాలి.
● దాఖలైన నామినేషన్లలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి.. తిరస్కరణకు గురైతే అందుకు కారణాలను అభ్యర్థులకు తెలియజేయాలి.
● నోటిఫికేషన్ జారీ చేసినప్పటినుంచి ప్రతిరోజూ నివేదిక అందజేయాలి.
● అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎన్నికల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
● నామినేషన్ల స్వీకరణ, విత్ డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేయించాలి.
● పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు
సజావుగా జరగాలి.
● నామినేషన్ల స్వీకరణకు అనువుగా ఉండే పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకోవాలి.
● పోలింగ్ రోజు జాగ్రత్తగా ఉండాలి.
ఫ జిల్లా పంచాయతీ అధికారి సునంద
ఫ ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment