చెంతనే నీరు.. వాడుతున్న పైరు
మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు విడుదల
ఫ నిండుకుండల్లా చెరువులు.. అయినా రైతులకు దక్కని ప్రతిఫలం
ఫ ఎగువ ప్రాంతాల్లోని బోర్లు, బావుల్లో పెరగని నీటి మట్టం
ఫ నీరందక ఎండుతున్న పొలాలు
మోటకొండూర్ : గోదావరి జలాలతో గ్రామాల్లోని చెరువులు నిండుతున్నాయని సంతోషించిన రైతులకు దాని ప్రతిఫలం మాత్రం కనిపించటం లేదు. ఎండలకు భూగర్భ జలమట్టం పెరగకపోవడంతో బోర్లు, బావులు అడుగంటుతున్నాయి. దీంతో నీరందక చేతికొచ్చిన పంటలు కళ్లెదుటే ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మోటకొండూర్ మండలంలో సాగు యోగ్యమైన భూమి 33 వేల ఎకరాలు ఉంది. గత ఏడాది యాసంగిలో 13,548 ఎకరాల్లో వరి సాగు చేశారు. చివరి దశకు చేరుకోగానే ఎండలు తీవ్రం కావటంతో కొంత నష్టం జరిగింది. దీంతో రైతులు ఈ ఏడాది యాసంగి సాగులో వరి సాగు తగ్గించారు. సుమారు 11వేల ఎకరాల్లో వరి వేసినట్లు అధికారులు అంచనా వేశారు. కొంతకాలంగా గోదావరి జలాలు వస్తుండడంతో సాగునీటికి కొదవ లేదనుకున్నారు. కానీ, భూగర్భ జలం పెరగకపోవడంతో ఎగువప్రాంతంలో పంటలు వాడుపడుతున్నాయి.
100 చెరువుల్లో నీరు ఫుల్
మల్లన్నసాగర్‌నుంచి గత కొంతకాలంగా ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు విడుదల చేస్తున్నారు. ఈ నీటితో 100కు పైగా చెరువులను నింపారు. బిక్కేరు, ఆలేరు పెద్దవాగు, బేగంపేట, కొలనుపాక తదితర వాగుల్లోకి కూడా గోదావరి జలాలు చేరుతున్నాయి. దిగువన ఉన్న ప్రాంతాల్లో చేలు దెబ్బతింటుండగా.. ఎగువన మాత్రం నీరందడం లేదని రైతులు వాపోతున్నారు.
పెరగని నీటి మట్టం
మోటకొండూరు చెరువు నిండా గోదావరి జలాలు చేరినా ప్రయోజనం లేకుండాపోయింది. ఎగువ ప్రాంతంలోని బోర్లు, వ్యవసాయ బావుల్లో భూగర్భ జలమట్టం పెరగకపోగా ఎండల కారణంగా రోజు రోజుకూ పడిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మోటకొండూరుతో పాటు రాయికుంటపల్లి, మేడికుంటపల్లి తదితర గ్రామాల పరిధిలోని పంట పొలాలకు సరిపడా నీరందక వాడుపడుతున్నాయి. ఎండలు ముదిరితే గొర్రెలు, ఆవులను మేపటానికి పొలాలను విడిచి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
నీళ్లందక పొలం ఎండిపోయింది
మోటకొండూరులో నాకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత సంవత్సరం యాసంగిలో నాలుగు ఎకరాలు వరి సాగు చేశాను. చివరి పది రోజులు నీళ్లు అందకపోవటంతో పక్క భూమి లో బోరు వేసుకుని కాపాడుకున్నా. ఈ ఏడాది 3.5 ఎకరాల్లో వరి సాగు చేశాను. నీళ్లు లేక పూర్తిగా ఎండిపోయింది. పశువులు మేపుకోమ్మని చెప్పాను. పెట్టుబడి మొత్తం పోయింది. మా ఏరియాలో చాలా మంది రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది.
–రేగు శ్రీశైలం, రైతు, మోటకొండూరు
రూ.లక్ష పెట్టుబడి పెట్టా
చెరువుల నిండా నీళ్లున్నా వ్యవసాయ బోర్లు, బావుల్లో భూగర్భ జలం పెరగడం లేదు. నాకు మోటకొండూరు చెరువు కింద నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇందులో వరి సాగు చేస్తున్నాను. ఈసారి వాతావరణ మార్పులు, నాసిరకం విత్తనాల కారణంగా పొలం సరిగా పెరగలేదు. ఇప్పటి వరకు పెట్టిన లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాను. అదంతా పూర్తిగా నష్టపోయాను. చెరువు కింద 200 ఎకరాల్లో వరి సాగు కాగా.. 100 ఎకరాల్లో నష్టం తప్పటం లేదు.
–బొబ్బలి చంద్రారెడ్డి, రైతు, మోటకొండూరు
చెంతనే నీరు.. వాడుతున్న పైరు
చెంతనే నీరు.. వాడుతున్న పైరు
చెంతనే నీరు.. వాడుతున్న పైరు
Comments
Please login to add a commentAdd a comment