సాధారణ ప్రసవాలు పెంచాలి : కలెక్టర్
భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం జిల్లాలోని వైద్యాధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమావేశమై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9గంటలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్మల్ డెలివరీల సంఖ్య పెంచడానికి మండల స్థాయినుంచి జిల్లా స్థాయి వరకు వైద్యాధికారులు.. ప్రతి గర్భిణి ఇంటికి వెళ్లి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించేలా ప్రోత్సహించాలని సూచించారు. కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి గర్భిణులకు అందుతున్న వైద్యసేవలు, తీసుకోవల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించేలా సూచనలు ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
నారసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యపూజలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. ఆ తర్వాత స్వామివారికి తులసీదళాలలను అర్పించి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. అదే విధంగా ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం, ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహా హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలను నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల జోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా దశరథరెడ్డి
ఆత్మకూరు(ఎం) : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా (2025–27) కార్యదర్శిగా ఆత్మకూరు(ఎం)కు చెందిన కందడి దశరథరెడ్డి నియామకం అయ్యారు.ఈ మేరకు జిల్లా డీఈఓ సత్యనారా యణ గురువారం ఆయనకు నియామకపత్రం అందజేశారు. దశరథరెడ్డి భువనగిరి మండలం చందుపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : సీపీ
భువనగిరి: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాచకొండ సీపీ సుధీర్‌బాబు గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి ఇటీవల 10 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment