గట్టుకు ఉత్సవ శోభ | - | Sakshi
Sakshi News home page

గట్టుకు ఉత్సవ శోభ

Published Sat, Feb 15 2025 1:52 AM | Last Updated on Sat, Feb 15 2025 1:48 AM

గట్టు

గట్టుకు ఉత్సవ శోభ

చివ్వెంల(సూర్యాపేట): రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఈనెల 16 నుంచి 20 వరకు జరగనుంది. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం నుంచి జాతర ప్రారంభం కానుండడంతో ఆలయ పరిసరాల్లో వివిధ దుకాణాలు వెలుస్తున్నాయి. భక్తుల కోసం జాయింట్‌ వీల్‌ (రంగుల రాట్నం), బ్రేక్‌ డ్యాన్స్‌, సర్కస్‌, హంస వాహనం, ఎగ్జిబిషన్‌ తదితర వినోద శాలలను ఏర్పాటు చేస్తున్నారు.

ఏర్పాట్లు ఇవీ..

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్‌ భగీరథ నీటికోసం 14 ప్రదేశాల్లో నల్లాలు ఏర్పాటు చేశారు. నిఘాకోసం 66 సీసీ కెమెరాలు అమర్చారు. చెరువు కట్టపై బారికేడ్లు, హైమాస్ట్‌ లైట్లు, భక్తులకు ఎండవేడిమి నుంచి రక్షణకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

నిధుల కేటాయింపు ఇలా..

జాతర నిర్వహణకు ప్రభుత్వం 70 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని చదును చేశారు. ఈసారి గుట్టపై దేవాదాయ శాఖ, గుట్టకింద మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.1.67 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. హైమాస్ట్‌, టవర్‌ లైట్లకు రూ.35 లక్షలు కేటాయించారు. జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు బారికేడ్ల ఏర్పాటుకు రూ.12 లక్షలు, తాత్కాలిక టాయిలెట్లకు రూ.12 లక్షలు కేటాయించారు. ఇవేకాక, చెత్త తొలగింపునకు రూ.25 లక్షలు, నేల చదునుకు రూ.10 లక్షలు, ఆలయం చుట్టూ చెట్ల పొదలు తొలగించేందుకు రూ.8లక్షలు, తాగునీటి సరఫరాకు రూ.3లక్షలు, నీటి ట్యాంకర్ల కోసం రూ.5లక్షలు, గల్ఫర్‌ ద్వారా బుదర తరలించేందుకు రూ.4లక్షలు, సీసీ రోడ్ల మరమ్మతులకు రూ.5లక్షలు, జాతర స్టోర్‌ డస్ట్‌కు రూ.5 లక్షలు, గ్రావెల్‌ కోసం రూ.5లక్షలు కేటాయించారు. సీసీ కెమెరాలు, సోలార్‌ లైట్ల మరమ్మతులకు రూ.5లక్షలు, స్నానాలు చేసేచోట ప్లాట్‌ఫామ్‌, పైపులైన్‌ ఏర్పాటుకు రూ.9.30 లక్షలు, నీటి మోటార్స్‌, సింథటిక్‌ ట్యాంక్స్‌, హెచ్‌డీపీఓ పైపులైన్‌ కోసం రూ.5లక్షలు, కోనేరులో శివుడి విగ్రహం ప్రతిష్ఠించేందుకు రూ.3 లక్షలు, నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

రేపటి నుంచి దురాజ్‌పల్లి శ్రీలింగమంతుల జాతర.. ఏర్పాట్లు పూర్తి

ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు, లైటింగ్‌, సివిల్‌ పనులు చేయించాం. జాతర ముగిసే వరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య సిబ్బంది, ప్రత్యేక అధికారులను అందుబాటులో ఉంచుతాం. – బోళ్ల శ్రీనివాస్‌,

సూర్యాపేట మున్సిపల్‌ కమిషనర్‌

జాతరకు 60 ప్రత్యేక బస్సులు

భానుపురి (సూర్యాపేట): పెద్దగట్టు జాతరకు సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నల్లగొండ ఆర్‌ఎం జానిరెడ్డి తెలిపారు.చార్జి పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గట్టుకు ఉత్సవ శోభ1
1/2

గట్టుకు ఉత్సవ శోభ

గట్టుకు ఉత్సవ శోభ2
2/2

గట్టుకు ఉత్సవ శోభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement