
కులగణన పేరుతో కాంగ్రెస్ డ్రామా
యాదగిరిగుట్ట : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఒక డ్రామా అని, సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ విమర్శించారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు సామాజిక న్యాయం చేస్తామని చెబుతున్న కాంగ్రెస్, ఇన్నాళ్లూ ఏం చేసిందన్నారు. 70 ఏళ్లలో ఒక్క ఓబీసీ వ్యక్తిని అయినా సీఎం చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ గణనను చట్టబద్ధమైన సంస్థలతో సర్వే చేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తే పార్లమెంట్‌లో ఆమోదించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సామాజిక న్యాయం పా టిస్తూ రాష్ట్రపతులను చేసిందని, కేబినెట్‌లో 27మంది ఓబీసీలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయన్నారు. ఎంఎంటీఎస్‌ను యాదగిరిగుట్టకు తీసుకువస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, రవీందర్, నాయకులు రచ్చ శ్రీనివాస్, చంద మహేష్, కర్రె ప్రవీ ణ్‌కుమార్, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంపీ ఈటల రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment