ఏడాదికాలంగా ఎదురుచూపులు
భువనగిరి: జిల్లా కేంద్రంలో క్రీడా మైదానాలు, పరికరాలు లేక విద్యార్థులు, యువత ఆటలకు దూరమవుతున్నారు. ఈనేపథ్యంలో మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం భువనగిరి మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరు చేసింది. ఈమేరకు 2023 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కాంప్లెక్స్ నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయించింది. అదే నెలలో అధికారులు డీపీఆర్ సైతం రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. కానీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు.
10 ఎకరాల స్థలం కేటాయింపు
జిల్లా కేంద్రంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు. స్పందించిన గత ప్రభుత్వం అప్పట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంజూరు చేసింది. ఇందుకోసం 10 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని, కలెక్టర్‌ను కోరింది. అయితే అప్పట్లో స్థల కేటాయింపు జరగలేదు. 2023 డిసెంబర్‌లో రాష్ట్రంలో ఽఅధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఈమేరకు రూ. 9.50 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాయగిరి, గూడూరు, ముత్తిరెడ్డిగూడెం ప్రాంతాల్లో స్థలం కోసం పరిశీలించారు. చివరికి రాయగిరి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 259లో 10 ఎకరాల స్థలాన్ని యువజన క్రీడల శాఖకు కేటాయించారు.
రూ. 33.50 కోట్లతో ప్రతిపాదనలు
మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలం కేటాయించిన అనంతరం డీపీఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు రూ.33.50 కోట్ల ఖర్చుతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టవచ్చని డీపీఆర్ సిద్ధం చేశారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు, అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేశారు. ఈ డీపీఆర్‌ను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. అయితే ఇప్పటి వరకు నిధులు మాత్రం మంజూరు కాలేదు.
డీపీఆర్ అందజేశాం
భువనగిరికి మంజూరైన మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది. స్థలం కూడా కేటాయించబడింది.
– ధనుంజయనేయులు,
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి
ఫ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంజూరు కాని నిధులు
ఫ స్థలం కేటాయించిన ప్రభుత్వం
ఫ రూ.33.50 కోట్లతో ప్రతిపాదనలు
Comments
Please login to add a commentAdd a comment